హైదరాబాద్: కువైట్ నుంచి హైదరాబాద్ రావాల్సిన విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. పలు జాతీయ మీడియాల కథనం ప్రకారం గత అర్థరాత్రి 1.30 గంటలకు ఇండిగోకి చెందిన 6ఇ1234 విమానం హైదరాబాద్‌లో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరింది. ఈ విమానం ఉదయం 8.10 గంటలకు శంషాబాద్‌లో ల్యాండ్ కావాల్సి ఉంది.
కానీ, విమానంలో మానవబాంబు ఉందని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో సంబంధిత అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలో విమానాన్ని ముంబైకి దారి మళ్లించారు. ఆ తర్వాత విమానంతో సహా ప్రయాణికులు అందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. అక్కడ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రయాణికులు అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.