మాస్కో: వాణిజ్య లోటు విషయంలో భారత్ ఆందోళనలు తమకు తెలుసని, అందుకే దాన్ని సమతూకం చేసేందుకు దిగుమతులను గణనీయంగా పెంచుకుంటామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కీలక ప్రకటన చేశారు. అలాగే ఉగ్రవాదంపై ఉమ్మడిగా కలిసి పోరాటం చేయడానికి సిద్ధమని తెలిపారు. దైపాక్షిక వాణిజ్యంపై ఇతర దేశాల ఒత్తిడి లేని వ్యాపార విధానాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో పుతిన్ భారత్‌లో పర్యటించనున్న నేపథ్యంలో భారత్ష్య్రా సంబంధాలపై రష్యా నుంచి ఈ ప్రకటన రావడం గమనార్హం. అమెరికా ఆంక్షల విధింపు ఎలా ఉన్నా భారత్‌కు రష్యా నుంచి చమురు సరఫరా తగ్గకుండా ప్రయత్నిస్తున్నట్టు పెస్కోవ్ తెలిపారు.
భౌగోళిక రాజకీయాలకు అతీతంగా పనిచేసే ఒక వాణిజ్య వ్యవస్థను అభివృద్ధి చేయాలని రష్యా కోరుకుంటున్నట్టు వెల్లడించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక వాణిజ్యం 2030 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ సహకారాన్ని కూడా మరింత విస్తరిస్తామని తెలిపారు. ఉక్రెయిన్ సంక్షోభంపై అమెరికా మధ్యవర్తిత్వం చాలా ప్రభావవంతంగా ఉందని , వారి ప్రయత్నాలు ఫలిస్తాయని ఆశిస్తున్నామన్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఈనెల 4,5 తేదీల్లో పుతిన్ భారత్‌లో పర్యటించనున్నారు. భారత్‌పై అమెరికా సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల 23 వ వార్షిక శిఖరాగ్ర సదస్సులో వాణిజ్యం, రక్షణ తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.