ఐర్లాండ్‌తో మంగళవారం జరిగిన మూడో, చివరి టి20లో ఆతిథ్య బంగ్లాదేశ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగ్లా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 21తో సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.5 ఓవర్లలో 117 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌గా దిగిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన స్టిర్లింగ్ ఐదు ఫోర్లు, ఒక సిక్స్‌తో 38 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ టిమ్ టెక్టర్ (17) పరుగులు చేశాడు. మిగతా వారిలో డాక్‌రెల్ (19), డెలాని (10) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ముస్తఫిజుర్, రిశాద్ మూడేసి వికెట్లను పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 13.4 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ తంజిద్ హసన్ తమీమ్ 36 బంతుల్లోనే అజేయంగా 55 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సైఫ్ హసన్ (19) పరుగులు సాధించాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన పర్వేజ్ 33 పరుగులు చేసి నాటౌగా నిలిచాడు. దీంతో బంగ్లా అలవోక విజయంతో సిరీస్‌ను దక్కించుకుంది.