మన తెలంగాణ/నారాయణపేట ప్రతినిధి : గత పాలకుల నిర్లక్ష్యంతోనే నారాయణపేట జిల్లాలోని మక్తల్ వెనుకబాటుకు గురైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మక్తల్‌లో సోమవారం పలు అభివృద్ధి పనులను మంత్రి వాకిటి శ్రీహరి, పలువురు సహచర మంత్రులతో కలిసి ఆయన ప్రారంభించారు. మక్తల్‌లో రూ.250 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్, నారాయణపేట నుంచి మక్త ల్, జూరాలపై వంతెన రోడ్డుతో పాటు మొ త్తం రూ.1,200కోట్ల అభివృద్ధి పనులకు శం కుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసి న బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ.. రాష్ట్రంలో తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కావస్తోందని, ఈ రెండేళ్ల విజయోత్సవ సభను మొదట మక్తల్‌లో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు పదేళ్ల బిఆర్‌ఎస్ పాలనలోనూ ఉమ్మడి పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.
పాలమూరు ప్రజలు అరిగోస పడుతున్నా ఏ నాయకుడు కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. అందుకే ఈసారి పాలమూరు జిల్లా ప్రజలు 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపించారని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో ఈ జిల్లా నుంచి బూర్గుల రామకృష్ణారావు సీఎం అయ్యారని, ఆ తర్వాత 75 ఏళ్లలో పాలమూరు జిల్లా నుంచి ఎవరు కూడా ముఖ్యమంత్రి కాలేదని, మళ్లీ ఇన్నాళ్ల తర్వాత రాష్ట్ర సీఎంగా మీ బిడ్డకు అవకాశం వచ్చిందని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు అన్ని పూర్తిచేసే బాధ్యత తనదని అన్నారు. ఇప్పటికే నారాయణపేటమక్తల్‌కొడంగల్ ప్రాజెక్టు, పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టులు పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అందుకే ప్రజా పాలన వారోత్సవాలు ఇక్కడి నుంచి మొదలుపెట్టామని చెప్పారు. కొందరు కుట్రపూరితంగా నారాయణపేట, మక్తల్, కొడంగల్ ప్రాజెక్టుపై కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏదీ ఆగదని చేశారు. ప్రాజెక్టులకు భూములు ఇచ్చిన ఏ రైతుకు కూడా అన్యాయం చేయబోమని, ఎకరాకు రూ.20 లక్షల పరిహారం ఇచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. మాయగాళ్లు మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధిని అడ్డుకోవద్దని రైతులను కోరారు. ఎంత ఖర్చయినా సరే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులన్నీ పూర్తిచేసే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు.
ఎన్ని నిధులు కావాలన్నా ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. ఇరిగేషన్, ఎడ్యుకేషన్ ప్రధాన అంశాలుగా తీసుకున్నట్లు చెప్పారు. కేవలం వలసలే పాలమూరు బిడ్డలను విద్యకు దూరం చేశాయని, అందువల్ల జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలు మంజూరు చేశామని తెలిపారు. ఒక్కరు కూడా ఆర్థిక సమస్యలతో చదువుకు దూరం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అన్ని నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్రాన్ని త్వరలో అభివృద్ధి దశలో తీసుకెళ్తామని తెలిపారు. రైజింగ్ 2047 లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లను మీ గ్రామాలను అభివృద్ధి చేసే వ్యక్తులనే గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లు అప్పు చేసిందని, ఆ అప్పులు కడుతూనే సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు. అభివృద్దికి అడ్డుపడేవాళ్లను స్థానిక ఎన్నికల్లో గెలిపించొద్దని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారిని గెలిపిస్తే గ్రామాల అభివృద్ధి జరగదని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, రాజేష్ రెడ్డి, వంశీకృష్ణ, మేఘారెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, శివకుమార్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.