పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం (1.12.2025) ప్రారంభమయ్యాయి. సాధారణంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరుగుతాయి. కానీ ఈసారి వాటిని 15 రోజులకే కుదించారు. ప్రవేశ పెట్టిన బిల్లులపై ప్రభుత్వాన్ని జవాబుదారీ చేసేందుకు సమగ్రంగా చర్చించడానికి విపక్షాలకు ఇదో అవకాశం. కానీ ఏదో ఒక అంశంపై పట్టుపట్టి పదేపదే సమావేశాలను బహిష్కరించినట్టయితే చర్చించే అవకాశాలను విపక్షాలు కోల్పోతాయి. అంతేకాదు ప్రభుత్వం ముందు ఒక రాజకీయ క్రీడగా మిగిలిపోతారు. గత కొంతకాలంగా పార్లమెంట్ సమావేశాల తీరుతెన్నులు పరిశీలిస్తే అలాగే ఉంటున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు నిర్వహించే అఖిలపక్ష సమావేశంలో చక్కగా ‘ధర్మోపదేశాలు’ వెలువడుతుంటాయి. సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని అధికార పక్షంనుంచి అభ్యర్థనలు వస్తుంటాయి. ప్రతి అంశంపై సమగ్రంగా చర్చ జరగాలన్న అభిప్రాయాలు వస్తుంటాయి. కానీ సమావేశాలు ప్రారంభమయ్యేసరికి ఎవరికి వారే యమునా తీరే అన్న విధానం బయటపడుతుంది.
ఏదో ఒక అంశంపై తప్పనిసరిగా చర్చ జరగాలని విపక్షాలు పట్టుపట్టడం, అధికార పక్షం మొండికెత్తడం, దాంతో విపక్షాలు సమావేశాలను బహిష్కరించడం మళ్లీ చివరి దశ లోనే బహిష్కరణల నుంచి విపక్షాలు వెనక్కి తగ్గి హాజరవుతుండటం పరిపాటి. మొత్తం మీద సమావేశాలు ముగిశాయి అని అటుఇటు సంతృప్తి పడుతుంటారు. సోమవారంనాడు పార్లమెంట్ సమావేశాల్లో కూడా అంతరాయం తప్పడం లేదు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకుని ప్రధాని మళ్లీ విమర్శలకు తెరలేపారు. ప్రతిపక్షాలకు చురకలంటించామన్న ఆత్మసంతృప్తి ప్రధాని ప్రసంగంలో వినిపించింది. క్రియాశీలక చర్చలు జరిగితేనే చట్టసభలకు సార్థకత అని సభ్యులకు హితోపదేశం చేసిన ప్రధాని మోడీ తరువాత తన స్వరం మార్చి సమావేశాల్లో డ్రామాలొద్దు.. కావాలంటే టిప్స్ ఇస్తానని విపక్షాలను కవ్విస్తూ ఎత్తిపొడిచారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటో ఆయనకే తెలియాలి. మరి అలాంటప్పుడు అఖిలపక్ష సమావేశాలెందుకు? బుజ్జగింపు మాటలెందుకు? అఖిలపక్ష సమావేశాల వల్ల ఒరిగిందేముంది? విపక్షాలు కూడా ప్రశ్నోత్తరాల గంటపై ఆందోళనకు దిగడంతో కొంతసేపు సమావేశాలకు అంతరాయం ఏర్పడింది. దీన్ని బట్టి సమావేశాలు అర్థవంతంగా కొనసాగిద్దామన్న స్ఫూర్తి సభ్యుల్లో కొరవడినట్టు విమర్శలు వస్తున్నాయి.
ఈసారి సమావేశాల్లో ఎస్‌ఐఆర్ (ఓటర్ల జాబితా సమగ్ర సవరణ) నిర్వహిస్తున్న తీరుపై విపక్షాలు గట్టిగా చర్చ జరగాలని పట్టుపట్టే అవకాశం కనిపిస్తోంది. ఉన్నత న్యాయస్థానం వద్ద కూడా ఎస్‌ఐఆర్‌పై అనేక పిటిషన్లు దాఖలై ఉన్నాయి. దీనిపై ప్రభుత్వ వైఖరి ఏమిటో అందరికే తెలిసిందే. కొన్ని సార్లు ఉన్నత న్యాయస్థానం ఎస్‌ఐఆర్ విషయంలో జోక్యం చేసుకోవడం జరుగుతోంది. అందుకని దీనిపై కూలంకషంగా చర్చ జరగాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందా అన్నది ప్రశ్నార్థకం. ప్రజాస్వామ్య సమతూకానికి ఓటర్ల సమగ్ర ప్రక్షాళన అవసరం అన్నవిషయాన్ని ఎవరూ కాదనలేరు. కానీ లోపాలను ఎత్తి చూపినప్పుడు దానిపై చర్చ జరగడం అవసరం. ఈ సమావేశాల్లో 13 బిల్లులు ప్రవేశపెట్టాలని సిద్ధమవుతున్నారు. అలాగే ఢిల్లీ లోని ఎర్రకోట వద్ద ఆత్మాహుతి కారు బాంబు పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత, కార్మిక కోడ్‌లుపై చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నా పాలక వర్గాల నుంచి ఎలాంటి హామీ రాలేదు. సాధారణ రుతుపవనాల వర్షాల కన్నా భారీ వర్షాలు కుండపోతగా కురియడంతో పంటలు దెబ్బతిని రైతులు కష్టనష్టాల పాలయ్యారు.
దేశరాజధానిని కకావికలం చేస్తున్న వాయు కాలుష్యం, భారత్ అమెరికా సంబంధాలపై మన దేశీయ విధానం, ఇవన్నీ చర్చకు రానున్నాయి. పార్లమెంట్ సభ్యులు చర్చించాల్సిన అవసరాన్ని విశాల దృక్పథంతో గుర్తించడానికి బదులు, స్వల్పకాలిక చర్చకు కూడా పాలకవర్గాలు అవకాశం ఇవ్వకపోవడాన్ని ఏమనుకోవాలి? ఏది చర్చించాలో ముందుగానే నిర్ణయించడం అవి తప్పితే మరేదైనా చర్చకు తీసుకు వస్తే నిరాకరించడం పార్లమెంట్ సమావేశాల విలువలను తగ్గించడమే అవుతుంది. ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలు వెల్లడించడానికి తగినంత సమయం కేటాయించక పోతే, ఆమేరకు ప్రభుత్వ ఆలోచనా విధానాల్లో మార్పు రాకుంటే ప్రజాస్వామ్య స్ఫూర్తి విచ్ఛిన్నమవుతుంది. దేశసమస్యలపై చర్చించడానికి పార్లమెంట్ తప్పితే మరేదైనా వేదిక ప్రతిపక్షాలకు ఉంటుందా? గత వర్షాకాల సమావేశాలన్నీ నిరంతరం అంతరాయాలతోనే ముగిశాయి. సమావేశాల నుంచి ఫలితాలు అత్యంత అల్పరేటింగ్‌లో కనిపించాయి. కేటాయించిన సమయం చర్చలతో అర్థవంతంగా వినియోగం కావలసి ఉండగా లోక్‌సభ కేవలం 29 శాతం, రాజ్యసభ 34 శాతం మాత్రమే పనిచేశాయి.
అలాగే పార్లమెంట్ సమావేశాల్లో అత్యంత ముఖ్యమైన సమయంగా పేర్కొనే ప్రశ్నోత్తరాల సమయం కూడా లోక్‌సభలో 23 శాతం, రాజ్యసభలో 6 శాతం పరమ అధ్వాన్నంగా వినియోగమయ్యాయి. గత సమావేశాల్లో ఆపరేషన్ సిందూర్, ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) అంశాలే పార్లమెంట్ సమావేశాలను ఎక్కువగా స్తంభింప చేశాయి. ఈసారి ఇతర ముఖ్యాంశాలతోపాటు ఎన్నికల కమిషన్ తీరు మళ్లీ చర్చకు వస్తే పార్లమెంట్ సమావేశాల సమయాన్ని వృథా చేసిన వారవుతారన్న అభిప్రాయం రాజకీయ నిష్ణాతుల్లో కనిపిస్తోంది. స్వేచ్ఛగా, నిష్కర్షగా చర్చించడానికి ఏమాత్రం అవకాశంఇవ్వని పాలకవర్గాల మొండితనం ఒకవైపు, తాము లేవనెత్తిన అంశాలపై తప్పనిసరిగా చర్చించాలన్న విపక్షాల డిమాండ్లు, నిరసనలుతో అంతరాయాలు మరోవైపు కొనసాగితే పేరుకే ప్రజాప్రతినిధుల సభ మరేమీ కాదన్న అధోగతికి పార్లమెంట్ సమావేశాలు దిగజారిపోతాయి.