మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ చీఫ్ ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు ఆయన సోదరికి ఎట్టకేలకు అనుమతి లభించింది. జైలులో ఇమ్రాన్ ఖాన్ మరణించినట్లు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపినట్లు బలూచిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై పుకార్లు రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున పాక్ లోని రావిల్పిండి జైలు వద్ద ఆందోళనకు దిగారు.
ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారనేందుకు రుజువు కోరుతూ ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో.. అడియాలా జైలు అధికారులు మంగళవారం మాజీ ప్రధానిని కలిసేందుకు ఆయన సోదరి ఉజ్మా ఖానుమ్‌ను అనుమతించినట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది.