వేర్వేరు కేసుల్లో గంజాయి విక్రయిస్తున్న ఆరుగురిని ఎక్సైజ్ సిబ్బంది మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఎక్సైజ్ సిబ్బంది గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నానక్‌రాంగూడలో గంజాయి డాన్ నీతుబాయి ఇంట్లో గంజాయి విక్రయిస్తున్నట్లు సమచారం రావడంతో ఎక్సైజ్ ఎస్‌టిఎఫ్ సిబ్బంది సోదాలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 786 గ్రాముల గంజాయి, 110 బీరు, బ్రిజర్, ఒక బైక్, రూ. 60,890 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌టిఎఫ్ బి టిం లీడర్ ప్రదీప్‌రావు , సిఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు, సిబ్బంది దాడి నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్‌ను అరెస్టు చేశారు. ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయిని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు విచారణలో తెలిపారు.
కేసు దర్యాప్తు కోసం నిందితులను, గంజాయి, నగదును శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించారు. కాగా, నాంపల్లి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని మంగూరు బస్తీలో గంజాయి విక్రయిస్తున్న కాంబ్లె పరిమళ, ఎస్. బసంతిని అరెస్టు చేశారు. 1.2కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒడిసా రాష్ట్రానికి చెందిన ఇద్దరు మహిళలు అక్కడ తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి తీసుకుని వచ్చి నగరంలోని విక్రయిస్తున్నారు. ఇద్దరు మహిళలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో కేసులో గంజాయి విక్రయిస్తున్న మంగ్లీ నరేష్ అనే వ్యక్తిని శేరిలింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 710 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌టిఎఫ్ సిబ్బంది నెహ్రూనగర్‌లో గంజాయి విక్రయిస్తుండగా ఎస్‌టిఎఫ్ సి టీం ఎస్సై మంజు, సిబ్బంది పట్టుకున్నారు.