తెలంగాణ పల్లెల్లో ఎన్నికల శంఖారావం వినిపించే ప్రతిసారీ చుట్టుపక్కల వ్యాపించే ఒక మాట ఏకగ్రీవం అప్రతిహతంగా రాజకీయ వాతావరణాన్ని చుట్టుముట్టుతుంది. ఏకగ్రీవం అంటే అసలు అర్థంలో ప్రజాస్వామ్య పరంపరలో గొప్ప చిహ్నం. ప్రజలందరూ ఒకే అభిప్రాయంతో, ఒకే సంకల్పంతో, గ్రామ ప్రగతిని మించిన ఆకాంక్ష లేకుండా, నిస్వార్థ సేవా మనస్సు ఉన్న వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకోవడం. స్వచ్ఛత, నిర్ణయాత్మకత, వినయం, ప్రజాహితం, ఇవే అసలు ఏకగ్రీవానికి నిలువెత్తు అర్థాలు. కాని కాలగమనంలో ఈ పవిత్రమైన భావన పల్లెల అంచుల వెంట బతుకుతున్న రోజువారీ కుటుంబ జీవితాలు గడుపుతున్న ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండే నాయకుడు ఉండాలి. కొంతమంది అవినీతిపరులైన రాజకీయ నాయకుల చేతుల్లో పడిపోవడంతో, అది ఇప్పుడు వేలంపాటలకు, బెదిరింపులకు, దురుద్దేశాలకు పూచికత్తిగా మారిపోయింది. ఇదే పరిస్థితికి ఒక ప్రతిబింబంగా గత రెండు దశాబ్దాలుగా గ్రామ ఎన్నికల్లో జరిగే ఏకగ్రీవాల శాతం పెరుగుతూ పల్లె రాజకీయాల్లో అజ్ఞాతంగా వ్యాపిస్తున్న వ్యాధిలా మారిపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు ఏడున్నర శాతం మాత్రమే ఉన్న ఏకగ్రీవ సర్పంచి ఎన్నికలు, తెలంగాణ రాష్ట్రంలో 2019నాటికి 17 శాతానికి పైగా దూసుకుపోయాయి. ఈ గణాంకాలు గ్రామ ప్రజాస్వామ్యం బలపడిందనే వాదనకు నిదర్శనమా? ఈ కాలంలో ఏకగ్రీవాలు గ్రామాభివృద్ధి ప్రతిబింబం కాదు. అవి గ్రామ ప్రజాస్వామ్యాన్ని నెమ్మదిగా మింగేస్తున్న ప్రాణాంతకమైన రాజకీయ వ్యాపారం. సేవాభావం లేకుండా, గ్రామం పట్ల బాధ్యతా రాహిత్యంతో, వ్యక్తిగత ప్రతిష్ట కోసమే పదవులను తమ కబంధహస్తాలలోకి తీసుకోవడం, గ్రామ ప్రజాస్వామ్యానికి అపాయకరం. ఒక గ్రామంలో ప్రజలు అభివృద్ధి కోసం ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంటే అది శుభసూచక సంకేతం. అయితే, అదే ప్రజల స్వరాన్ని డబ్బుతో ముంచి, వారిని నిర్ణయించనియ్యకుండా బలవంతపు ఏకగ్రీవాలు చేయిస్తే అది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన, ప్రమాదకరమైనచర్య. ఇలా గ్రామ ప్రజాస్వామ్యాన్ని బంధించిన శక్తులు విస్తరిస్తున్న సమయంలో, మహాత్మాగాంధీ చెప్పిన గ్రామ స్వరాజ్యం అనే భావనను ఒక్కసారి తలచుకుంటే పరిస్థితి ఎంత విరుద్ధ దిశలో నడుస్తోందో అర్థమవుతుంది.
మహాత్మా గాంధీ ఊహించిన గ్రామం అనేది స్వయం సమృద్ధిని చాటే వ్యవస్థ. రోడ్లు, విద్య, వైద్యం, వ్యవసాయం, శానిటేషన్, నీటి వనరుల నిర్వహణ వంటి అంశాల్లో గ్రామమే స్వయంగా నిర్ణయాలు తీసుకోవాలి. గ్రామసభ శక్తి కేంద్రంగా ఉండాలి. సర్పంచి ప్రజల సేవకుడిగా ఉండాలి. పంచాయతీ ప్రజల సంక్షేమాన్ని అత్యున్నత లక్ష్యంగా భావిస్తూ పని చేయాలి. అయితే నేటి గ్రామాల్లో చూస్తున్న దృశ్యం దీనికన్నా భిన్నంగా, కొన్నిసార్లు విరుద్ధంగా కనిపించడం బాధాకరం. పల్లెల్లో ఇప్పటికీ వెలుగులేని వీధులు, గుంతల రోడ్లు, పాడైపోయిన డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యుల లేమి, మహిళలు, వృద్ధులు ఎదుర్కొనే తీవ్రమైన సమస్యలు, వేసవి కాలంలో తాగునీటి కోసం పడే పోరాటం ఇవన్నీ చూస్తే స్వాతంత్య్ర భారత్‌లో 78 ఏళ్లు పూర్తయ్యాక కూడా పల్లెల పరిస్థితి ఎంత వెనకబడి ఉందో అర్థమవుతుంది.
గ్రామ ప్రజలకు అత్యవసరమైన సమస్యలు పరిష్కారాలు లేకుండా మిగిలిపోతున్నాయి. దీని వెనక కారణం ఏమిటి? పంచాయతీలకు తగిన నిధుల ఉండవు, వచ్చిన నిధుల దుర్వినియోగం, స్వయం ఆదాయ వనరుల కొరత, స్థానిక నాయకుల నిర్లక్ష్యం, ప్రభుత్వాల నిరాసక్తత, గ్రామ ప్రజల హక్కులపై అవగాహన లేకపోవటం. కొన్నిసార్లు పంచాయతీ కార్యాలయాలకు తాత్కాలికంగా అద్దె భవనాల్లో పని చేయాల్సి వచ్చే దుస్థితి చూస్తే గ్రామపాలన ఎంత బలహీనంగా మారిపోయిందో తెలుస్తోంది. నిధుల విషయంలో కూడా పంచాయతీలకు ఎదురవుతున్న దుర్భర పరిస్థితి వేరే విధంగా లేదు. పల్లెల్లో బ్లీచింగ్ పౌడర్ వేసేందుకు కూడా నిధులు లేవనిపించటం ఏ శకానికి నిదర్శనం? బడ్జెట్ కొరతలతో చదును చేసే రోడ్లు నిలిచిపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడాన్ని లెక్కచేయరాదు అన్నపద్ధతిలో వ్యవహరించడం, కాలువల నిర్మాణం, చెత్త సేకరణ వంటి ప్రాథమిక వ్యవస్థలు తారుమారవడం-ఇవి అన్నీ పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న లోతైన సమస్యలను మన ముందుంచుతున్నాయి.
ప్రజాస్వామ్యం పునాదిగా నిలిచే గ్రామ పాలన ఇలాగే బలహీనంగా ఉందంటే దేశ అభివృద్ధి ఎలా సాధ్యం? గ్రామాల్లో ప్రజాస్వామ్యాన్ని నిజంగా బలపర్చాలంటే ఏకగ్రీవాల పేరుతో జరుగుతున్న రాజకీయ వ్యాపారాన్ని నిలువరించడం అత్యావశ్యం. గ్రామ ప్రజలు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలి. యువత గ్రామాభివృద్ధి కోసం ముందుకు రావాలి. పారదర్శకతను పెంచే విధానాలు పంచాయతీల్లో అమలు చేయాలి. నిధుల వినియోగంపై గ్రామసభకు పూర్తి హక్కు ఇవ్వాలి. ప్రతి రూపాయి ఖర్చుపై ప్రజల ముందే స్పష్టమైన వివరాలు ఉంచాలి. సత్యమైన ప్రజాస్వామ్యం ఎన్నికలతోనే బతుకుతుంది. పోటీ ఉంటేనే నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండాల్సిందే. ప్రజల అవసరాలు, సమస్యలు, గ్రామ అభివృద్ధి ఇవన్నీ ఒక నాయకుడిని ప్రజలు జవాబుదారీగా ఉంచుతారని తెలిసినప్పుడు మాత్రమే బాధ్యతాయుతంగా పనిచేయమని బలవంతం చేస్తాయి. కానీ ఏకగ్రీవం అయితే బాధ్యత అనే పదం అక్కడే చనిపోతుంది. నాయకుడు పనులు చేయకపోయినా నిలదీయడానికి ఒక వేదిక కూడా మిగలదు.
ప్రజల మాట వినాల్సిన అవసరమే ఉండదు.ఇది అభివృద్ధికి అడ్డం, గ్రామప్రగతికి ప్రమాదం. గ్రామ స్వరాజ్యం అంటే ప్రజలు నిర్ణయాలు తీసుకునే స్వయం పాలన. కానీ ఏకగ్రీవాల అనర్ధం వల్ల అది నాయకుల స్వలాభ పాలనగా మారిపోతోంది. నిజమైన అభివృద్ధి జరగాలంటే ప్రజాస్వామ్యం బలపడాలి. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా చెప్పగలిగే వాతావరణం ఉండాలి. ప్రజలు అనుమతించిందే జరగాలి. గ్రామంఅంటే నాయకుడు కాదు, గ్రామం అంటే ప్రజల సమష్టి సముదాయం. గ్రామ ప్రజాస్వామ్యం పునర్నిర్మాణం కావాలి అంటే పారదర్శకత, నిష్పక్షపాతం, ప్రజల భాగస్వామ్యం ప్రధానమైన అంశాలు కావాలి. నాయకులు సేవా భావంతో ముందుకు రావాలి. గ్రామసభలు సజీవంగా ఉండాలి. మానవ విలువలు, గ్రామ బంధం, ప్రజల శ్రేయస్సు- ఇవి మాత్రమే పాలనకు ప్రమాణాలుగా ఉండాలి. ధనబలం, అహంకారం, వ్యక్తిగత ప్రతిష్టల కోసం గ్రామాల భవిష్యత్తును కోల్పోయే రోజులు పోవాలి. పల్లెల బాగోగులే పల్లె ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ప్రమాణం. అన్ని పల్లెల్లో ప్రజాస్వామ్య వసంతాలు పుష్పిస్తేనే తెలంగాణ అభివృద్ధి, ఆర్థిక, రాజకీయ, స్వయం పాలనతో సంపూర్ణమవుతుంది అనేది నగ్న సత్యం.
– మన్నారం నాగరాజు, 9550844433