హానీ ట్రాప్ చేసి యువకుడి వద్ద నుంచి సైబర్ నేరస్థులు రూ.1.02లక్షలు కొట్టేశారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని యాకత్‌పురకు చెందిన యువకుడు(20) టెలీగ్రాంలో వచ్చిన మెసేజ్‌కు స్పందించాడు. మహిళ పేరుతో ఛాటింగ్ చేసిన సైబర్ నేరస్థులు సెక్స్‌వల్ సర్వీస్ అందిస్తామని చెప్పారు. యువతి ఫొటోతో సైబర్ నేరస్థులు ఛాటింగ్ చేయడంతో నిజమని నమ్మిన యువకుడు వారు చెప్పినట్లు చేశాడు. యువతిని హోటల్‌కు పంపిస్తామని చెప్పారు.
దానికి ముందుగా అడ్వాన్స్ బుకింగ్, సర్వీస్ సెక్యూరిటీ, రూమ్ రిజర్వేషన్ కోసం ముందుగానే డబ్బులు చెల్లించాలని చెప్పారు. దానికి అంగీకరించిన యువకుడు యూపిఐ ద్వారా రూ.1,02,093 ట్రాన్స్‌ఫర్ చేశాడు. తర్వాత బాధితుడు అబిడ్స్‌లోని హోటల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేయగా ఎవరూ రాలేదు. వెంటనే టెలిగ్రాంలో సంప్రదించగా సైబర్ నేరస్థులు వెంటనే రూ.10వేలు పంపించాలని బ్లాక మెయిల్ చేశారు. దీంతో తాను సైబర్ నేరస్థుల చేతుల్లో మోసపోయానని గ్రహించాడు. వెంటనే హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.