సర్పంచి పోస్టు ఏకగ్రీవాల కోసం భారీగా ఖర్చు
ఓటు హక్కుతో దక్కాల్సిన పదవులను వేలం పాట ద్వారా దక్కించుకునేందుకు కొందరు అభ్యర్థుల ప్రయత్నాలు
గ్రామ పెద్దలు, కుల సంఘాల నేతలతో మద్దతుతో ముందుగానే కుదుర్చుకుంటున్న ఒప్పందాలు
ఆ మేరకు ఒక్కరే నామినేషన్లు దాఖలు
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారిక ప్రకటన
నిబంధనలు పాటిస్తేనే ఏకగ్రీవం చెల్లబాటు
మార్గదర్శకాలు జారీ చేసిన ఎస్‌ఇసి
మనతెలంగాణ/హైదరాబాద్ : ఓటు హక్కుతో రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన సర్పంచి పదవులను కొందరు వేలం పాట ద్వారా సొంతం చేసుకుంటున్నారు. ఇందుకోసం భారీగా ఖర్చు చేసేందుకు బడా రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామపంచాయతీల్లో సర్పంచి పీఠాలను ఏకగ్రీవంగా కైవసం చేసుకునేందుకు పలువురు అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల్లోకి వెళితే అనవసరంగా భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసుకోవాల్సి రావడంతో పాటు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తామన్న గ్యారంటీ ఉండదు. ఈ నేపథ్యంలో కొంతమంది అభ్యర్థులు గ్రామ పెద్దలు, కుల సంఘాల నాయకుల మద్దతుతో సర్పంచి పదవికి ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. పలు గ్రామాలలో ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకుని కేవలం ఒక్కరే నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిసింది.
సిద్దిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్, రాయిపోల్, వర్గల్ మండలాల్లోని కొన్ని గ్రామాలలో ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాల మేరకు కేవలం ఒక్కరే నామపత్రాలు దాఖలు చేసినట్లు సమాచారం. ఏకగ్రీవం కోసం రూ.15 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు వెచ్చించినట్లు తెలుస్తోంది. హత్నూర మండలంలోని రెండు తండాల్లో ఏకంగా ఎన్నికలు లేకుండానే పదవులు దక్కించుకునేందుకు ఎత్తులు వేస్తున్నట్లు సమాచారం. మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామంలో సర్పంచి పదవి కోసం రూ.కోటి వరకు వెచ్చిస్తానని ఓ వ్యక్తి ప్రకటించినట్లు ప్రచారం జరిగింది. నవాబుపేట మండలం దొడ్డిపల్లి సర్పంచి, ఉప సర్పంచి పదలను ఏకగ్రీవం చేశారు.జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం మిట్టదొడ్డి సర్పంచి పదవిని ఓ సీడ్ ఆర్గనైజర్‌కు రూ.90 లక్షలకు, ఇదే మండలం గోర్లాఖాన్‌దొడ్డిలో రూ.57 లక్షలకు, అలాగే లింగాపురం గ్రామంలో రూ.34 లక్షలకు వేలంలో పదవులను ఏకగ్రీవం చేసుకున్నారు.
గద్వాల మండలం కొండపల్లిలో రూ.60 లక్షలకు ఓ సీడ్ ఆర్గనైజర్ వేలంతో పదవిని దక్కించుకున్నట్లు సమాచారం. అలాగే నల్లదేవునిపల్లి (కుర్వపల్లి)లో రూ.45 లక్షలకు ఒకరు కైవసం చేసుకోగా, రూ.15 లక్షలు అడ్వాన్స్ ఇచ్చినట్లు తెలిస్తోంది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి సర్పంచి పదవిని రూ.42 లక్షలకు ఏకగ్రీవం చేసినట్లు సమాచారం. వీరాపురంలో రూ.50 లక్షలకు వేలం పాడుకున్నట్లు సమాచారం. మరోవైపు ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం జోగ్గూడెం వాసులు తమ గ్రామ సర్పంచి పదవిని రూ.20 లక్షలకు వేలం పాడిన వ్యక్తికి అప్పగించాలని నిర్ణయించారు. ఇక్కడ పూర్తిగా ఎస్‌టి లంబాడీ తెగకు చెందిన వారు నివాసం ఉంటున్నారు. నల్గొండ జిల్లా బంగారిగడ్డ గ్రామ పంచాయతీకి 11 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, గ్రామస్థులందరూ గ్రామాభివృద్ధే ధ్యేయంగా భావించి ఏకగ్రీవం చేసేందుకు ఆదివారం గ్రామంలో చర్చించారు. గ్రామంలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం, గ్రామ అభివృద్ధి కోసం తాము సిద్ధంగా ఉన్నామని నామినేషన్ దాఖలు చేసిన ముగ్గురు అభ్యర్థులు తెలిపారు. దీనికి గ్రామస్థులందరూ వేలం నిర్వహించగా, మహ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి రూ.73 లక్షలతో గ్రామాభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చి సర్పంచ్ పదవికి కైవసం చేసుకున్నారు.
దీనికి అభ్యర్థులందరూ అంగీకారం తెలుపుతూ దాఖలు చేసిన నామినేషన్లను ఉపసంహరించుకుంటామంటూ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. దీంతో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానం ఏకగ్రీవమైంది. కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లె సర్పంచ్ ఏకగ్రీవం అయ్యింది. ఎస్‌సి కేటగిరీకి రిజర్వ్ అయిన కొండారెడ్డిపల్లె సర్పంచ్ పదవికి 15 మంది పోటీ పడగా,గ్రామ పెద్దలు సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేశారు. గ్రామ పెద్దలు 15 మందిలో ఒకరి పేరును ప్రకటించారు. ఈ ఏకగ్రీవాలను నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.
రిజర్వేషన్ల మార్పుతో తగ్గిన బలమైన అభ్యర్థులు
పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో యుద్ధ వాతావరణం ఉంటుంది. ఎంఎల్‌ఎ పోరు కంటే పల్లెపోరునే ఎంతో ఆసక్తిగా ఉంటుంది. గ్రామంలో సర్పంచి పదవి అంటేనే అందరూ ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు. ఆ సర్పంచి పీఠం కోసం అభ్యర్థుల మధ్య పోటాపోటీ ఉంటుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నికలకు ముందు నుంచే ఊళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వారి సొంత డబ్బులతో చేస్తుంటారు. మరికొంత మంది సర్పంచి పదవి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. కొందరు ఆస్తులను, భార్యల పుస్తెల తాడులను కూడా తాకట్టు పెట్టి సర్పంచి పీఠం కోసం పోటీ చేస్తారు. అయితే కొన్ని గ్రామాలలో మాత్రం కొంతమంది అభ్యర్థులు గ్రామానికి ఇన్ని డబ్బులు ఇస్తాము అని చెప్పి ఏకగ్రీవం చేసుకుంటుంటున్నారు. అయితే చాలా గ్రామాల్లో సర్పంచి స్థానాలకు ఇటీవల ప్రకటించిన రిజర్వేషన్ అభ్యర్థులకు అనుకూలంగా రాకపోవడంతో పోటీ చేయాలని భావించిన బలమైన అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. దీంతో ఆశావహులు తగ్గడంతో ప్రధానంగా పలు గ్రామాల్లో ప్రధాన పార్టీల నుంచి బలమైన అభ్యర్థులే కనిపించడం లేదు. దీంతో స్వతంత్య్ర అభ్యర్థుల వైపు రాజకీయ పార్టీల చూపు మళ్లింది. స్థానిక కార్యకర్తల బలంతో గెలిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాలకు ఆమోదం : ఎస్‌ఇసి మార్గదర్శకాలు
పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఇసి) దృష్టి సారించింది. ఏకగ్రీవ ఎన్నికల విషయంలోజిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, ఎంపిడిఒలకు సూచనలు చేస్తూ ఎస్‌ఇసి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. వేలంపాట, బెదిరింపులకు పాల్పడితే అలాంటి ఏకగ్రీవ ఎన్నిక చెల్లదని ఎస్‌ఇసి స్పష్టం చేసింది. తెలంగాణ పంచాయతీరాజ్ (ఎన్నికల నిర్వహణ) చట్టం -2018లోని 15వ నిబంధన ప్రకారం.. ఒక స్థానంలో పోటీలో ఒక్కరే ఉన్నప్పుడు ఎన్నికల ఫలితాన్ని వెంటనే ప్రకటించాలి. అయితే, గ్రామ ప్రజలను ప్రలోభాలకు గురి చేసి.. ఒక్కరే పోటీలో ఉండడం, ఇతర అభ్యర్థులను భయపెట్టడం లేదా మోసానికి పాల్పడడం వంటివి జరగకుంటేనే ఏకగ్రీవంగా ప్రకటించాలని సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించడానికి ముందు, రిటర్నింగ్ అధికారి నిబంధనలు పాటించారా.. లేదా..? అనే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపింది. ఏకగ్రీవాల ప్రకటన కోసం జిల్లాల్లో ప్రత్యేక పర్యవేక్షక విభాగాలను నియమించాలని పేర్కొంది.
తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 211 ప్రకారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో జరిగే వేలంపాట, ప్రలోభాలు, బెదిరింపులు, ఇతర దుశ్చర్యలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రత్యేక పర్యవేక్షక విభాగాల ద్వారా స్వీకరించాలని తెలిపింది. సర్పంచ్, వార్డు స్థానానికి ఏకగ్రీవమైతే అభ్యర్థుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలి. ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు, ప్రలోభాలకు గురికాకుండా స్వచ్ఛందంగా నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు అభ్యర్థులతో ధ్రువీకరణ పత్రం తీసుకోవాలని మార్గదర్శకాలలో పేర్కొంది. అదేసమయంలో పోటీలో ఉన్న ఒకే ఒక్క అభ్యర్థి నుంచి కూడా తాను ప్రత్యర్థుల ఉపసంహరణ కోసం ఎలాంటి బెదిరింపులకు పాల్పడలేదని, వేలంపాటలో పాల్గొనలేదని ధ్రువీకరించే పత్రాన్ని తీసుకోవాలని తెలిపింది.
అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు నిర్ధారణకు వస్తే.. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే రిటర్నింగ్ అధికారులు నిర్దేశిత నమూనాలో ఎన్నిక పత్రాన్ని అందజేయాలని పేర్కొంది. ప్రత్యేక పర్యవేక్షక విభాగం నుంచి వచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాతే ధ్రువీకరించి, వాటిపై ఫిర్యాదులు, అభ్యంతరాలు లేకుంటేనే ఏకగ్రీవాన్ని ఆమోదించాలని తెలిపింది. అదే సమయంలో ఈ ఫలితం సమాచారంతో ఓ నివేదికను రూపొందించి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపాలని పేర్కొంది. గ్రామంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనట్లు గుర్తిస్తే.. ఏకగ్రీవ ఎన్నిక ఫలితాన్ని రద్దు చేయాలని మార్గదర్శకాల్లో తెలిపింది.