సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో చిరస్మరణీయ సెంచరీ సాధించిన స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిపై అతని సహచరుడు కుల్దీప్ యాదవ్ ప్రశంసలు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లి బ్యాటింగ్ చూసి తామంత ఎంతో ఆనందానికి గురయ్యమన్నాడు. కోహ్లి ఇన్నింగ్స్‌ను గమనిస్తే అతను గాడిలో పడినట్టేనని పేర్కొన్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత కోహ్లి ఇలాంటి ఇన్నింగ్స్ ఆడాడన్నాడు. రానున్న రోజుల్లో మరింత మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచేందుకు ఇది దోహదం చేస్తుందన్నాడు. తాను కెరీర్ ఆరంభించినప్పుడూ విరాట్ వరుస సెంచరీలతో చెలరేగి పోయేవాడన్నాడు. రాంచిలో అతను ఆడిన ఇన్నింగ్స్ ఒకప్పటి విరాట్‌ను తలపించిందని కుల్దీప్ అభిప్రాయపడ్డాడు. తనలాంటి ఎంతో మంది క్రికెటర్లకు కోహ్లినే స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.