రాంచీలో జరిగిన వన్డేలో టీం ఇండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ (135) సెంచరీలో కదం తొక్కగా.. రోహిత్ (57) తనదైన శైలీ ధనాధన్ మెరుపులతో అర్థ శతకం చేశారు. దీంతో వీరిద్దరు తమ ఫిట్‌నెస్‌పై వచ్చిన ప్రశ్నలుకు సమాధానం ఇచ్చినట్లైంది. అంతేకాక 2027 ప్రపంచకప్ వరకూ జట్టులో కొనసాగాలని అనుకుంటున్న అభిమానులకు భరోసా ఇచ్చారు.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. విరాట్-రోహిత్‌లు లేకుంటే వన్డే ప్రపంచకప్ గెలవడం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. వారిద్దరూ వేరే లెవల్‌లో క్రికెట్ ఆడుతున్నారని పేర్కొన్నారు. ‘‘ఇక ప్రపంచకప్‌లో రోహిత్-విరాట్‌లు ఆడుతారా? ఫిట్‌నెస్‌తో ఉంటారా? వంటి ప్రశ్నలు వేయొద్దు. వాళ్లిద్దరు కలిసి 20 ఓవర్లు బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్థి కథ సమాప్తమైనట్లే. రాంచీలో అదే జరిగింది. వారిద్దరు తమ బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు. వాళ్లు నెలకొల్పిన భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను మానసికంగా దెబ్బతీసింది. రో-కో జోడి చాలా కష్టపడుతున్నారు. కేవలం ఒకే ఫార్మాట్‌లో ఆడుతూ తమ రిథమ్‌ను కొనసాగించడం అంత సులువు కాదు. ప్రపంచకప్‌లో వారిద్దరు కీలకం కానున్నారు’’ అని శ్రీకాంత్ అన్నారు.
కాగా, ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 349 పరుగులు చేసి దక్షిణాఫ్రికా 350 పరుగుల విజయలక్ష్యాన్ని ముందుంచింది. ఈ లక్ష్యాన్ని చేధించడంతో సఫారీలు విఫలమయ్యారు. 332 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ కావడంతో భారత్ ఈ మ్యాచ్‌లో 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో వన్డే రాయ్‌పూర్ వేదికగా జరుగనుంది.