మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ఆదివారం ప్రారంభమైంది. తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 3,242, వార్డు స్థానాలకు 1,821 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనున్నాయి. ఈ నెల 2 వరకు అభ్యర్ధులు నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు సమర్పింవచ్చు. ఈ నెల 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 6 వరకు ఉపసంహరణ గడువు ఉంది. అదేరోజు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు.
డిసెంబర్ 14వ తేదీన ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు. తొలి విడత నామినేషన్ల గడువు శనివారం ముగియగా, చివరి రోజు సర్పంచ్ స్థానాలకు 17,940, వార్డు స్థానాలకు 70,596 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు మొత్తం 25,654 నామినేషన్లు దాఖలు కాగా, 37,440 వార్డు స్థానాలకు మొత్తం 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి.