* 7న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంబరాల్లో పాల్గొననున్న సీఎం
* 10, 11, 12 తేదీల్లో లక్షల మంది ప్రజలు సందర్శించేలా ఏర్పాట్లు
* విలేకర్ల సమావేశంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించినట్లు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్ డిసెంబర్ 8,9 తేదీల్లో జరగనున్న తరుణంలో ఉత్సవాల్లో భాగంగా డిసెంబర్ 1 నుంచే రాష్ట్రవ్యాప్తంగా పాత ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను ప్రారంభించుకుని మొదలు పెట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 1న (సోమవారం) మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌లో, 2న ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో , 3 న కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో, 4 న ఆదిలాబాద్‌లో , 5న వరంగల్ జిల్లా నర్సంపేటలో, 6న నల్గొండ జిల్లా దేవర కొండలో ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాల్లో జరిగే అన్ని ఉత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొంటారని, ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంట్ సభ్యులు సంబరాల్లో పాల్గొంటారని చెప్పారు.7 న హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని యూనివర్సిటీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు, విద్యా వ్యవస్థకు సంబంధించిన కార్యక్రమాలను ప్రకటిస్తారని చెప్పారు. 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో రెండేళ్లలో ఇందిరమ్మ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, రాష్ట్ర సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తామని చెప్పారు. 9న భవిష్యత్‌లో తెలంగాణ 2047 రైజింగ్ తెలంగాణ కోసం ప్రణాళికలు, పెట్టుబడులను ఆహ్వానిస్తున్నాం, ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నామో విజన్ డాక్యుమెంట్ ప్రకటిస్తామని వెల్లడించారు. ఈ సమ్మిట్‌కు రాష్ట్రంలోని ప్రముఖులతో పాటు దేశంలోని ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని, విజయాలను సాధించిన వ్యక్తులను, ప్రపంచంలో కూడా అత్యున్నత విజయాలను సాధించిన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామన్నారు. 2047 నాటికి ఇది మా విజన్ అని ప్రకటిస్తామని, ఇక్కడ ఎలాంటి మౌలికవసతులు కల్పిస్తున్నామో వివరిస్తామన్నారు. 10, 11, 12 తేదీల్లో లక్షల మంది రాష్ట్ర ప్రజలు సందర్శించేలా స్టాల్స్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రపంచ దృష్టిని ఆకర్షించిన 13న క్రీడాకారుడు లియోనల్ మెస్సీ హైదరాబాద్ నగరానికి వచ్చి ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్‌బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొంటారన్నారు. ఈ వేడుకల్లో అందరం భాగస్వాములవుదామని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.