అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా నూజివీడు మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సరిహద్దు వివాదంలో రెండు గ్రామాల రైతులు దాడులు చేసుకున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా దేవరగుంట, జంగం గూడెం గ్రామాల మధ్య చింతలగట్టులో ఆర్ఎస్ నెంబర్ వన్ ప్రభుత్వ భూమిలో సాగు విషయంలో వివాదం నడుస్తోంది. రాత్రి వేళల్లో పొలంలోని నీటిబోర్లు ధ్వంసం చేయడంతో పాటు నాటిన మొక్కలు తొలగించారు. ఒకరిపై మరొకరు కవ్వింపు చర్యలతో ఇరు గ్రామాల రైతుల మధ్య వివాదం ముదిరింది. రెండు గ్రామాల రైతులు ఒకరిపై మరొకరు కర్రలతో దాడులు చేసుకున్నారు. ఘర్షణలో రెండు గ్రామాలకు చెందిన నలుగురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నూజివీడు ప్రభుత్వాసుపత్రికి పోలీసులు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.