దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యానికి రైతులనే నిందించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంట వ్యర్థాల దగ్ధం వల్లనే ఢిల్లీలో వాయు నాణ్యత దెబ్బ తిందనే వాదనను తోసిపుచ్చింది. వాయు కాలుష్యం అంశాన్ని కేవలం శీతాకాలంలోనే చర్చించుకోవడం వల్ల ప్రయోజనం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో కూడిన ధర్మాసనం సోమవారం తెలిపింది. వాయు కాలుష్యం అనేది తీవ్ర సంక్షోభం దీనిపై నిరంతర పర్యవేక్షణ , జాగ్రత్త చర్యలు అవసరం అని జస్టిస్ జాయ్‌మాలా బాగ్చీ సహ సభ్యులుగా ఉన్న ధర్మాసనం తెలిపింది. కాలుష్య సమస్యను రాజకీయం చేయరాదని స్పష్టం చేశారు. పంజాబ్ , హర్యానా సరిహద్దులలో పంట వ్యర్థాల దహనంతోనే దేశ రాజధానిలో కాలుష్య తీవ్రత పెరిగిందని ఢిల్లీ ప్రభుత్వం వాదిస్తోంది. వాయు కాలుష్య సమస్యపై చాలా కాలంగా సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. కాలాన్ని బట్టి ఏర్పడే సమస్యగా వాయు కాలుష్యాన్ని లెక్కలోకి తీసుకుంటే చిక్కులు తప్పవని హెచ్చరించారు.
రైతులు పంట వ్యర్థాలను ఎందుకు పొలాల కళ్లాల తరువాత తగులబెట్టాల్సి వస్తోంది? వీటిని సకాలంలో సరైన రీతిలో నిర్మూలించేందుకు సరైన యంత్రాలు, ఏర్పాట్లు వారి వద్ద ఉన్నాయా? అనేది విశ్లేషించుకోవల్సి ఉందని ధర్మాసనం తెలిపింది. వాయు కాలుష్య సమస్య గురించి కనీసం నెలకు రెండు సార్లు అయినా సమీక్ష జరగాలి. స్వల్పకాలిక దీర్ఘకాలిక పరిష్కారాలను ఈ క్రమంలో కనుగొనాల్సి ఉంటుందని బెంచ్ అభిప్రాయపడింది. ప్రభుత్వాలు పార్టీల రాజకీయాల కోణంలో, అహంకార ధోరణితో ఈ విషయాన్ని చూడటానికి వీల్లేదని తెలిపారు. కోవిడ్ దశలో ఢిల్లీలో వాయుకాలుష్యం తక్కువగా ఉంది. అప్పుడు కూడా ఈ సమయంలోనే పంట వ్యర్థాల దగ్థం జరిగింది. కానీ అప్పుడు ప్రజలు పొగచూరని , నిర్మలమైన ఆకాశం చూడగలిగారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదని, దీనిని బట్టి చూస్తే వాయుకాలుష్యానికి కారణం వేరే ఉందని తెలుస్తోందని చీప్ జస్టిస్ సూర్యకాంత్ చెప్పారు. పరోక్షంగా ఆయన ఇదంతా కూడా వాహన కాలుష్యంతో తలెత్తిన విషమ పరీక్ష అని విశ్లేషించారు. ఈ కోర్టులో రైతులను నిందించడం తరచూ జరుగుతోంది. అయితే వారి తరఫున వాదనలు విన్పించడానికి అరుదుగా హాజరీలు ఉంటాయని సిజెఐ వ్యాఖ్యానించారు.
తాము కేసు విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తున్నామని ఆ లోగా వాయు ప్రమాణాల నిర్వహణ కమిషన్, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఇతర సంబంధిత పక్షాలు కాలుష్య నివారణకు తీసుకుని తీరాల్సిన విషయాలను స్పష్టం చేయాల్సి ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. కేసుకు సంబంధించి ప్రభుత్వ సంస్థల తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్యర్య భటి హాజరయ్యారు. పంట వ్యర్థాల దగ్ధం, వాహన కాలుష్యం, భవన నిర్మాణ రంగ ధుమ్మూ ధూళి, రోడ్ల దుమ్ము , సేంద్రీయ వ్యర్థాల దహనం వంటి పలు కారణాలు ఉన్నాయని చెప్పారు. దీనితో ఏకీభవించని ధర్మాసనం ఇదంతా కాదు తమకు ఈ విషయంపై వారంలో తగు నివేదిక అందించాలని ఆదేశించి, విచారణను వాయిదా వేశారు. అశాస్త్రీయ పట్టణ నగర అభివృద్ధి , యాంత్రీకరణలు వంటివి వాయు నాణ్యత క్షీణతకు దారితీస్తున్నాయని ధర్మాసనం తెలిపింది.