యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ దేశవాళీ టి-20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ టోర్నమెంట్‌లో తన సొంత జట్టు జార్ఖండ్‌కు అతడు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జార్ఖండ్, త్రిపుర జట్టుతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో త్రిపుర జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
అనంతరం జార్ఖండ్ జట్టు 17.3 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 185 పరుగులు చేసి విజయం సాధించింది. జార్ఖండ్ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ 50 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సుల సాయంతో 113 పరుగులు చేసి అద్భుత శతకాన్ని సాధించాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో టి-20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. ఇషాన్ కెప్టెన్, కీపర్‌గా ఉంటూ సాధించిన సెంచరీలు మూడు. గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2018-19 సీజన్‌లో జార్ఖండ్ కెప్టెన్‌గా, కీపర్‌గా అతడు రెండు సెంచరీలు చేయగా.. ఈ సీజన్‌లో మరో సెంచరీ సాధించాడు. అంతకు ముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. గిల్‌క్రిస్ట్ మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల తరఫున కీపర్‌గా, కెప్టెన్‌గా ఉంటూ రెండు శతకాలు సాధించాడు.