ఎపి సిఎం చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై గత జగన్ ప్రభుత్వ హయాంలో నమోదైన ఎక్సైజ్ కేసును ఎసిబి కోర్టు సోమవారం మూసివేసింది. ఫిర్యాదు చేసిన వారు నిరభ్యంతర పత్రం ఇప్పటికే న్యాయస్థానానికి అందజేశారు. సిఐడి అధికారు ల దర్యాప్తును అంగీకరించి కేసును ఎసిబి కోర్టు క్లోజ్ చేసింది.
కేసు పూర్వాపరాల్లోకి వెళితే….
వైసిపి ప్రభుత్వ హయాంలో 2023 అక్టోబర్ 30న ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని సిఐడి కేసు నమోదు చేసింది. గతంలో టీడీపీ హయాంలో 2014-19 లో ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగాయని, డిస్టిలరీలకు అర్హత లేకపోయినా లైసెన్సులు ఇవ్వడం, కొందరికి ప్రయోజనాలు కల్పించే విధంగా వ్యవహరించారని సిఐడి అభియోగాలు మోపింది.దీనిపై పిసి యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఈ మేరకు ఎపి బేవరేజేస్ ఎండి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఐడి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎ1 గా సుధాకర్, ఎ2 కొల్లు రవీంద్, ఎ3 చంద్రబాబు పేర్లను ఎపి సిఐడి నమోదు చేసింది.
అయితే తాజాగా ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఇందుకు ఆధారాల్లేవని సిఐడి కోర్టుకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తెలియజేయడంతో ఈ కేసును మూసివేసింది. అలాగే గతంలో చంద్రబాబుపై గత ప్రభుత్వం పెట్టిన ఫైబర్‌నెట్ కేసును కూడా కోర్టు మూసివేసింది. ఈ కేసులో ఎలాంటి అక్రమాలు జరగలేదని, సంస్థకు ఎటువంటి ఆర్థిక నష్టం వాటిల్లలేదని సిఐడి దర్యాప్తులో తేలినట్టు పేర్కొన్నారు.