భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
దిత్వా తుఫాన్ ప్రభావంతో చలిగాలులు
మన తెలంగాణ/హైదరాబాద్: గత కొన్ని రోజులుగా చలికి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె, పట్నం తేడా లేకుండా గజ గజా వణికిపోతుంది. చాలా ప్రాంతాల్లో ఉదయం పూట పొగ మంచు దృశ్యాలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. అయితే దిత్వా తుఫాన్ ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో చలి తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా విపరీతమైన చలి గాలులు వీస్తాయని అంచనా వేసింది. దిత్వా తుఫానుతో డిసెంబర్ తొలి వారంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో వర్షాలు కురిసినా చలి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదని, తీవ్రమయిన చలిగాలులు వీచే ఆవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాల్లో 9 నుంచి 11 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. చలి ప్రభావం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్య సమస్యలు, వ్యాధులతో బాధ పడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఉదయం, రాత్రి వేళల్లో ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని, మధ్యాహ్నం సమయంలోనే ఊర్ల ప్రయాణాలు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. చలితోపాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో ఆదివారం ఉదయం వరకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, తొమ్మిది జిల్లాల్లో 12 డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా మన్యం గ్రామాల్లో మధ్యాహ్నాం 12 అయినా చలి తీవ్రత మాత్రం తగ్గడం లేదు. హైదరాబాద్‌లోనూ మూడ రోజులపాటు రాత్రి ఉష్ణోగ్రతలు 11 నుంచి 14 డిగ్రీలుగా నమోదవుతాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఆదివారం ఉదయం వరకు రాష్ట్రంలో ఆదిలాబాద్‌లో 10.3, కామారెడ్డిలో 10.8, నిజామాబాద్‌లో 10.9, నిర్మల్‌లో 11, సంగారెడ్డిలో 11.2, వికారాబాద్‌లో 12.4, రాజన్న సిరిసిల్ల, జగిత్యాలలో 12.5, సిద్దిపేట, మెదక్‌లో 13, మంచిర్యాలో 13.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శేరిలింగంపల్లిలో 14.1, రామచంద్రాపురం, పఠాన్ చెరులో 14.4, రాజేంద్రనగర్‌లో 14.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.
పలు జిల్లాలకు వర్ష సూచన
దిత్వా తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో పలు జిల్లాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 2 నుంచి 5 వరకు రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలి, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. అధిక వర్షాలతో నేలలు చిత్తడిగా మారి గాలిలోని తేమశాతం పెరగటం, ఉత్తర భారతదేశం నుంచి చలి గాలులు వీస్తుండటం, వాతావరణ మార్పుల ప్రభావంతో నవంబరు మాసంలో సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా డిసెంబరు నెలలో చలి అధికంగా ఉంటుందని, ప్రస్తుతం నవంబరు నెల నుంచే చలి పంజా విసరుతోందని చెపుతున్నారు. ఈ క్రమంలో రాబోయే మూడు రోజులు చలిగాలులు అధికంగా వీచే అవకాశందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.