దిత్వా తుఫాన్ ప్రభావం రాష్ట్రంలో పలు జిల్లాలపై ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్ 2 నుంచి 5 వరకు రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు జిల్లాలపై తుఫాను ప్రభావం ఉంటుందని అధికారులు చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో అక్కడక్క భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చలి, వర్షాల నేపథ్యంలో ప్రజలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు.
అధిక వర్షాలతో నేలలు చిత్తడిగా మారి గాలిలోని తేమశాతం పెరగటం, ఉత్తర భారతదేశం నుంచి చలి గాలులు వీస్తుండటం, వాతావరణ మార్పుల ప్రభావంతో నవంబరు మాసంలో సాధారణం కన్నా 2 నుంచి 6 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా డిసెంబరు నెలలో చలి అధికంగా ఉంటుందని, ప్రస్తుతం నవంబరు నెల నుంచే చలి పంజా విసరుతోందని చెపుతున్నారు. ఈ క్రమంలో రాబోయే మూడు రోజులు చలిగాలులు అధికంగా వీచే అవకాశందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.