చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్‌టిసి బస్సులు ఢీకొనగా.. ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. శివగంగ జిల్లా తిరువత్తూర్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తున్న ఓ బస్సు.. కారైకుడి నుంచి దిండిగల్‌కు వెళ్తున్న మరో బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది, పోలీసులు, అంబులెన్స్‌లు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. బస్సుల నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. స్థానిక పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.