కదంతొక్కిన విరాట్ కోహ్లి
రోహిత్, రాహుల్ అర్ధ సెంచరీలు
కుల్దీప్, హర్షిత్ మ్యాజిక్
రాంచీ: దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో ఆతిథ్యటీమిండియా 17 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతో పాటు కెప్టెన్ కెఎల్ రాహుల్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టునుఆదుకున్నారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌటైంది. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన సఫారీ టీమ్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్లు మార్‌క్రమ్ (7), రియాన్ రికెల్టన్ (0), వన్‌డౌన్‌లో వచ్చిన డికాక్ (0) విఫలమయ్యారు. దీంతో సౌతాఫ్రికా 11 పరుగులకే మూడు వికెట్లను కోల్పోయింది.
ఈ దశలో మాథ్యూ బ్రిట్జ్‌కె (72), టోనీ డి జోర్జి (39) డెవాల్డ్ బ్రేవిస్ (39) అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలిచారు. విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన మార్కొ జాన్సన్ 39 బంతుల్లోనే 70 పరుగులు చేశాడు. కార్బిన్ బోస్చ్ (67) కూడా అసాధారణ బ్యాటింగ్‌ను కనబరచడంతో సౌతాఫ్రికా పోరాడి ఓడింది. భారత బౌలర్లలో కుల్దీప్ నాలుగు, హర్షిత్ మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను విరాట్ కోహ్లి ఆదుకున్నాడు. ధాటిగా ఆడిన కోహలి 120 బంతుల్లోనే 11 ఫోర్లు, ఏడు సిక్సర్లతో 135 పరుగులు చేశాడు. రోహిత్ 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 57, కెప్టెన్ రాహుల్(60), జడేజా (32) పరుగులు సాధించారు.