నవంబర్ 29, 1947 తేదీ హైదరాబాద్ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. దేశం స్వాతంత్య్రం పొందిన మూడు నెలలకే, హైదరాబాద్ సంస్థానంలో 15 ఆగస్టు 1947 పూర్వపు పరిస్థితిని కొనసాగించేందుకు ‘యథాతథ స్థితి ఒప్పందం’ కుదిరిన రోజు ఇది. స్వాతంత్య్రం వచ్చినా భారత ఉపఖండంలోని అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ మాత్రమే భారత్ యూనియన్‌లో విలీనానికి ముందుకు రాకపోవడం, ఆ కారణంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, రజాకారు దౌర్జన్యాలు, ప్రజా తిరుగుబాట్లు, చివరకు జరిగిన సైనిక చర్య -ఇవన్నీ ఈ తేదీ చుట్టూ తిరిగే చారిత్రక వాస్తవాలు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన 1947 నాటికి బ్రిటిష్ భారతంలో 565 సంస్థానాలు ఉండేవి. బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ ద్వారా వీటికి మూడు మార్గాలు సూచించబడ్డాయి. భారత్‌లో కలవడం, పాకిస్తాన్‌లో విలీనం కావడం లేదా స్వతంత్రంగా నిలవడం. ఆ అవకాశం వచ్చినపుడు జనాభా నిర్మాణం, సామాజిక-, రాజకీయ వాస్తవాలకు విరుద్ధంగా మూడు సంస్థానాలు విలీనానికి నిరాకరించాయి. జునాఘడ్, కశ్మీర్, హైదరాబాద్. జునాఘడ్ విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కఠిన నిర్ణయంతో ప్రజాభిప్రాయం ఆధారంగా విలీనాన్ని సాధించగా, కశ్మీర్ పరిస్థితి భిన్నమై యుద్ధం రూపందాల్చింది. కానీ అత్యంత క్లిష్టమైనది హైదరాబాద్ సంస్థాన సమస్య.
భూభాగ పరిమాణం, ఆర్థిక శక్తి, మత-జాతి సమగ్రత, రాజకీయ సంక్లిష్టతల వల్ల హైదరాబాద్ విలీనం సులభం కాని పని అయింది. ఆదిలాబాద్ నుండి రాయచూర్ వరకు, ఏడు తెలంగాణ జిల్లాలు, ఐదు మరఠ్వాడా జిల్లాలు, మూడు కర్ణాటక జిల్లాలతో కలిపి 82,000 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించిన హైదరాబాద్ రాష్ట్రం మూడు ప్రధాన భాషల (తెలుగు, మరాఠీ, కన్నడ)తో జీవించిన సంస్థానం. ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ పరిపాలన చివరి దశలో ఖాసిం రజ్వీ నేతృత్వంలోని ఇత్తెహాదుల్ ముస్లిమీన్ సైనిక విభాగమైన రజాకార్లు హింస, దోపిడీ, మతవిద్వేషం, క్రూరపాలనకు ప్రతీకలుగా మారారు. రాజ్యం అంతటా 90కు పైగా పన్నులు విధించబడడం, ప్రజల్ని బానిసలుగా మార్చే వెట్టిచాకిరి విధానాలు, తెలుగు వారికి అవమానకర స్థితి, సంప్రదాయాలపై, మతాచారాలపై, భాషపై జరిగిన దాడులు ప్రజల్లో వ్యతిరేకతను అగ్నికీలకంగా మార్చాయి. రజాకార్ల ‘తొడెలు, సుడులు’ పేరుతో పిలిచే దౌర్జన్యాలు, గ్రామాల్లో మహిళలపై జరిగిన అమానుష హింసలు, యువకులపై జరిగిన చిత్రహింసలు ఆ కాలపు తెలంగాణకు నిత్యనరకం.
ఈ పరిస్థితుల్లో స్వామి రామానంద తీర్థ ఆధ్వర్యంలో ఆర్యసమాజ్ ఉద్యమాలు, సాయుధ కమ్యూనిస్టు పోరాటాలు, ప్రజల స్వాభిమానం కాపాడేందుకు ఏర్పడిన రహస్య సంఘాలు, గ్రామాల రక్షణకోసం భూముల యజమానులు, పని జీవులు ఏర్పరచుకున్న దళాలు అన్నీ కలసి నిజాం నిరంకుశ పాలనకు ఎదురు నిలిచాయి. రావి నారాయణరెడ్డి, చండ్రరాజేశ్వరరావు, మల్లుస్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం, మాడపాటి హన్మంతరావు, దాశరథి, కాళోజీ, సుద్దాల హనుమంతు, అనభేరి ప్రభాకర్‌రావు, షోయబుల్లా ఖాన్ వంటి నేతలు, కవులు, రచయితలు ఈ పోరాటం ద్వారా తెలంగాణకు స్వరమిచ్చారు. నారాయణరావు పవార్, శంశాబాద్ గంగారాం సైతం నిజాంపైనే బాంబులు విసిరిన ఘటనలు ప్రజల్లో తిరుగుబాటును మరింత వేగవంతం చేశాయి. ఇదే కాలంలో నిజాం పాలన అంతర్జాతీయ వేదికలపై ‘హైదరాబాదు స్వతంత్రదేశం’గా గుర్తింపు పొందాలని ప్రయత్నించింది. పాకిస్తాన్ తో రహస్య చర్చలు, విదేశాలనుంచి ఆయుధాల కొనుగోలు ప్రయత్నాలు, ఐక్యరాజ్యసమితిలో భారత్‌పై ఫిర్యాదు ఇవన్నీ పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. రజాకార్లు రోజురోజుకీ అదుపు తప్పగా, మరోవైపు కమ్యూనిస్టుల సాయుధ పోరాటం రాజ్యం అంతటా విస్తరించగా, శాంతి ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నిజాంకు ‘యథాతథ స్థితి ఒప్పందం’ ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వ ప్రేరణతో నిజాం ఢిల్లీకి వెళ్లి మౌంట్ బ్యాటన్, సర్దార్ పటేల్‌లను కలిశాడు. 1947 నవంబర్ 29న సంతకం చేసిన ఈ ఒప్పందం ప్రకారం సంవత్సరం పాటు 15 ఆగస్టు 1947 నాటి పరిపాలనా నిర్మాణం కొనసాగాలి. భారత ప్రభుత్వ ప్రతినిధిగా కె.ఎం. మున్షీ హైదరాబాద్‌లో ఏజెంట్ జనరల్‌గా పనిచేయాలి అన్న నిబంధనలు అమలులోకి వచ్చాయి. కానీ ఈ ఒప్పందం కూడా శాంతికి దారితీయలేదు. నిజాం తొలుత ఒప్పుకున్నా రజాకార్లు మాత్రం హింసను మరింత పెంచారు. ప్రజల కేకలు ఢిల్లీల్లో వినిపించగా, పటేల్ సహనం సరిహద్దుకు చేరింది. సమస్యకు చివరి పరిష్కారం కోసం సర్దార్ పటేల్ సైనిక చర్యకే మొగ్గుచూపాడు. 1948 సెప్టెంబర్ 13న జనరల్ జె.ఎన్. చౌదరి నాయకత్వంలో ఆపరేషన్ పోలో ప్రారంభమైంది. నాలుదిక్కుల నుంచి భారత సైన్యం పురోగమించగా రజాకార్ల దళాలు కొన్ని రోజుల్లోనే చెల్లాచెదురయ్యాయి.
నిర్ణయాత్మక సమయంలో నిజాం, హుస్సేన్ సాగర్ తీరంలోని లేక్ వ్యూ అతిథి గృహంలో ఉన్న ఏజెంట్ మున్షీని కలసి లొంగుబాటు నిర్ణయం వెల్లడించాడు. సెప్టెంబర్ 17న నిజాం అధికారికంగా భారత్ ముందు తలవంచడంతో హైదరాబాద్ విమోచన జరిగింది. తదనంతరం లాయక్ అలీ, ఖాసింరజ్వీ తొలగింపబడి ఖైదు చేయబడ్డారు. జెఎన్ చౌదరి సైనిక గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించగా, ఎంకె వెల్లోడి ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. 1956లో నిజాంకు భరణం, రాజబిరుదుల కొనసాగింపు వంటి ఒప్పందాలు కుదిరాయి. అక్టోబర్ 31, 1956 వరకూ నిజాం రాజ్ ప్రముఖుడిగా కొనసాగాడు. ఈ విధంగా దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత మరొక సంవత్సరం పాటు తెలంగాణ ప్రజలు అనుభవించిన దుష్టరాజ్యం, రజాకార్ల ఉన్మాదం, వేలాది మంది తెలియని వీరుల త్యాగాలు, సర్దార్ పటేల్ రాజకీయ సంకల్పం, భారత సైన్య ధైర్యసాహసాలు కలిసి హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో విలీనం చేశాయి.
రామకిష్టయ్య సంగనభట్ల
9440595494