పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి (సోమవారం) నుంచి ఆరంభమవుతాయి. ఈ సెషన్‌లో ప్రత్యేకించి ఎన్నికల సంఘంపై ప్రతిపక్షాలు తమ దాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. ఓటర్ల జాబితాల సవరణ (సర్)ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ ఇతర విపక్షాలు తమ విమర్శనాస్త్రాలను ఉభయ సభలలో విన్పించేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. సమావేశాల నేపథ్యంలో ఆదివారం (నేడు) ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. ఉదయం 11 గంటలకు ఈ భేటీ తరువాత సభా వ్యవహారాల మండలి (బిఎసి) సమావేశాలు ఉంటాయి. వింటర్ సెషన్‌కు తమ వ్యూహాలను ఖరారు చేసుకునేందుకు ఇండియా కూటమి తరఫున పలు పార్టీల ఫ్లోర్ లీడర్స్‌తో సోమవారం ఉదయం రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే కార్యాలయంలో జరుగుతుంది. సభలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాల సహకారం కోసం ప్రభుత్వం అభ్యర్థిస్తుంది.
బీహార్ ఎన్నికల తరువాత తొలిసారిగా జరిగే పార్లమెంట్ సమావేశాలు కానుండటంతో బిజెపికి ఎన్‌డిఎకు ఇవి ప్రాధాన్యతాంశపు సమావేశాలు అయ్యాయి. డిసెంబర్ 19వ తేదీ వరకూ సమావేశాలు జరుగుతాయి. సర్ ప్రక్రియ దశల్లో పలువురు బూత్ స్థాయి అధికారుల మరణాలు , ఓట్ల చోరీ అంశాలు ప్రధానంగా ప్రస్తావించేందుకు కాంగ్రెస్ సిద్ధం అయింది. సర్ ఒత్తిళ్లతో కింది స్థాయి ఉద్యోగులు మానసిక వేధింపులకు గురై, గుండెపోట్లతో చనిపోతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఓటర్ల జాబితాల సవరణ సాధారణ విషయం, ఎన్నికలకు ముందు జరిగే విస్తృత ప్రక్రియ అని, ఏ దశలో ఎటువంటి చర్యలు ఉంటాయి? నిజమైన ఓటర్ల పరిరక్షణ, నకిలీ ఓట్ల తొలిగింపు వంటివి ప్రభుత్వం ప్రస్తావిస్తుంది. ఈసారి సెషన్‌లో పది కీలక బిల్లులను తీసుకురావడానికి ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో అణు ఇంధన రంగంలో మార్పులు, ఉన్నత విద్య, కార్పోరేట్ లా, సెక్యూరిటీస్ మార్కెట్ బిల్లు వంటివి సభల్లో ప్రవేశపెడుతారు.