బెంగళూరు: ముఖ్యమంత్రి పదవిపై గత వారం రోజులుగా కర్ణాటక కాంగ్రెస్ లో గందరగోళం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శనివారం ఉదయం సిఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సిఎం డికె శివకుమార్ అల్పాహారం కోసం సమావేశమయ్యారు. ఇద్దరు సీనియర్ నాయకుల మధ్య శాంతి కోసం కాంగ్రెస్ నాయకత్వం ఒత్తిడి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి పదవిపై పార్టీ లోపల కొనసాగుతున్న ఉద్రిక్తతను తగ్గించడానికే ఇద్దరు లీడర్లు సమావేశమైనట్లు సమాచారం. కాంగ్రెస్ హైకమాండ్ ఇద్దరు నాయకులను మాట్లాడుకుని విభేదాలను పరిష్కరించుకోవాలని కోరింది. హైకమాండ్ ఆదేశాలను మేరకు, సిఎం సిద్ధరామయ్య శివకుమార్‌ను అల్పాహార సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
“హైకమాండ్ ఏమి చెప్పినా నేను అంగీకరిస్తాను. నా వైఖరిలో ఎటువంటి మార్పు లేదు. హైకమాండ్ ఏమి చెప్పినా మేము దానిని పాటిస్తాము” అని సిద్ధరామయ్య శుక్రవారం పేర్కొన్నారు. సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. 2023లో కర్ణాటక ఎన్నికల సమయంలో హైడ్రామా నడిచింది. చివరికి కాంగ్రెస్ పార్టీ.. డికె శివకుమార్ కు నచ్చజెప్పి.. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించింది.