యువకుడి కాలికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు సర్జికల్ బ్లేడ్ కాలు లోపల మర్చిపోయి కుట్లు వేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తుని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. చిన్నా అనే యువకుడు తుని మండలం ఎస్ అన్నవరం పంచాయతీ పరిధిలోని రామక్రిష్ణ నగర్ లో నివసిస్తున్నాడు. కాగా సంవత్సరన్నర క్రితం కాలికి గాయం అవ్వడంతో విశాఖపట్నంలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఆ సమయంలో కాలులో స్టీల్ రాడ్డు, స్క్రూ వేశారు. కొన్నిరోజులుగా కాలులో నొప్పి రావడంతో తుని ఆసుపత్రికి వచ్చి కాలులో ఉన్న స్క్రూ ను తొలగించాలని డాక్టర్లను సంప్రదించాడు. డాక్టర్లు శస్త్రచికిత్స చేసి కాలులో ఉన్న స్క్రూను తొలగించారు. ఈ క్రమంలో శస్త్రచికిత్సకు ఉపయోగించిన సర్జికల్ బ్లేడ్ ను కాలు లోపల ఉంచేసి కుట్లు వేశారు.ఆ తర్వాత ఎక్స్ రేలో కనపడడంతో మళ్లీ ఆపరేషన్ చేసి ఆ బ్లేడును తొలగించారు.