భారత లెజండరీ, మాజీ క్రీకెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మరో రికార్డుపై టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కన్నేశాడు. మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ లో భాగంగా భారత్, రేపు(నవంబర్ 30) రాంచీ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ బరిలోకి దిగుతున్నాడు. ఈక్రమంలోనే సచిన్ రికార్డు బ్రేక్ చేసేందుకు ఒక అడుగు దూరంలో ఉన్నాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ చేస్తే.. ఒకే ఫార్మాట్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రికార్డును నెలకొల్పనున్నాడు. ప్రస్తుతం సచిన్, కోహ్లీలు ఒకే ఫార్మాట్‌లో 51 సెంచరీలతో సమంగా ఉన్నారు. అయితే, టెస్ట్‌లలో సచిన్ ఈ ఫీట్ సాధిస్తే.. కోహ్లీ వన్డేలలో ఈ ఘనత సాధించాడు.
కోహ్లీ, దక్షిణాఫ్రికాపై అద్భుతమైన రికార్డును కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు సఫారీ జట్టుపై 29 వన్డే ఇన్నింగ్స్‌లలో 65.39 సగటుతో, 85.74 స్ట్రైక్ రేట్‌తో కోహ్లీ 1504 పరుగులు చేశాడు. ఆ జట్టుపై ఇప్పటివరకు ఐదు సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి వన్డేలో రాణించే అవకాశం ఉంది. కాగా, డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో ఇరుజట్ల మధ్య 2వ వన్డే జరగనుంది. డిసెంబర్ 6న విశాఖపట్నంలో చివరి వన్డే జరుగుతుంది.