దివంగత కాంగ్రెస్ నేత రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా 1985లో ఒక మాట చెప్పారు. అట్టడుగు వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్రం కేటాయించే ప్రతి రూపాయిలో 15 పైసలు మాత్రమే అర్హులకు చేరుతున్నాయని, మిగతా 85 పైసలు అవినీతి, అధికార యంత్రాంగపు లోపభూయిష్ట విధానాల కారణంగా వృథా అయిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారతదేశంలో అట్టడుగు పేదవర్గాలు అధిక శాతం నివసించేది గ్రామాల్లోనే. రాజీవ్ గాంధీ ఆరోజు చేసిన ప్రకటన ఎంత ప్రాచుర్యం పొందిందంటే చివరకు సుప్రీంకోర్టు కూడా ఒక దశలో ఆధార్ కు సంబంధించిన ఒక తీర్పులో ఆయన ప్రకటనను ఉటంకిస్తూ కేంద్రం కేటాయించే నిధులు పేద ప్రజలకు చేరాల్సిన చారిత్రక అవసరం పారదర్శకంగా నెరవేరాలంటే ఆ నిధులు మధ్యలో గల్లంతయ్యే పరిస్థితి లేకుండా నేరుగా లబ్ధిదారుడికి అందే డీబీటీ విధానాన్ని సూచించింది.
భారతదేశం గ్రామాల్లో ఉంటుందని కదా అంటాం. అటువంటి గ్రామాల్లో స్వపరిపాలన జరగాలనే మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్యం కోరుకున్నారు. అందుకే గ్రామపంచాయతీలకు రాజకీయ ప్రమేయం లేని ఎన్నికలు జరుగుతుంటాయి. రాజకీయాలకు అతీతంగా గ్రామాభివృద్ధికి, అక్కడ నివసించే పేదల సంక్షేమానికి పాటుపడే వారిని ఎన్నుకోవాలి. తెలంగాణరాష్ట్రంలో ప్రస్తుతం గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పంచాయతీల గడువు ముగిసి దాదాపు రెండు సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో కేంద్రంనుంచి గ్రామ పంచాయతీలకు రావలసిన దాదాపు 2,800 కోట్ల రూపాయల నిధులు ఇప్పుడయినా ఎన్నికలు జరపకపోతే రాకుండా పోతాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పక్షం ఆ విషయం చెబుతుండగా కొద్దిమంది ఎన్నికల నిలుపుదలను కోరుతూ కోర్టును ఆశ్రయించడం దుర్మార్గం. వెనుకబడిన తరగతుల ఛాంపియన్లమని చెప్పుకునేవారు కొందరు ఆ నిధులు పోతే పోయాయి తమ రిజర్వేషన్ల సంగతి తేలేదాకా ఎన్నికలు జరపడానికి వీల్లేదని ప్రకటనలు, హెచ్చరికలు చేయడం కూడా చూస్తున్నాం.
2019లో పంచాయతీ ఎన్నికలు జరిగాక ఆ ఐదేళ్ల కాలంలో గ్రామాలకు సక్రమంగా నిధులు అందక ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగా తమ సొంత డబ్బు ఖర్చు చేసి అప్పులపాలై గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచులలో ఆర్థిక ఒత్తిడి తట్టుకోలేక 60 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్న విషయం ఇక్కడ ఒకసారి వీరికి గుర్తు చేయాలి.ఈ మాట్లాడుతున్న వారు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కావాలంటే పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాలి కాబట్టి అక్కడ పోరాటం చేద్దామని, అక్కడి పెద్దల మీద ఒత్తిడి తెద్దామని ఆలోచించడం లేదు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని చట్టం చెబుతున్నది. మొత్తానికి రాజకీయ రణగొణ ధ్వని ఎక్కువైపోయింది పంచాయతీల ఎన్నికల నిర్వహణ విషయంలో.
డిసెంబర్ ఆఖరులోగా గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు ప్రస్తుత ఎన్నికల నిలుపుదలను అంగీకరించలేమని స్పష్టంగా చెప్పేసింది కాబట్టి ఇక ఎన్నికలు ఆగే పరిస్థితి అయితే లేదు. నిన్న శనివారంతో మొదటి దశ నామినేషన్ల పర్వం కూడా ముగిసిపోయింది. ఎన్నికలు ఎలాగూ జరుగుతాయి కాబట్టి రాజకీయ పార్టీలన్నీ తమ శక్తియుక్తుల్ని గ్రామపంచాయతీలను కైవసం చేసుకునేందుకు ఉపయోగిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఏకగ్రీవాల తంతు కూడా మొదలైంది.గ్రామాభివృద్ధి పేరిట సర్పంచి పదవుల అమ్మకాలు రాజకీయ పక్షాల పరోక్ష మద్దతుతోనే జోరందుకున్నాయి.
2028లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకోవాలంటే ప్రస్తుతం జరుగుతున్న పంచాయితీ ఎన్నికల్లోనూ, ఆ తర్వాత జరగబోయే మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు తదితర అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తమ బలం పెంచుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, పదేళ్లు అధికారంలో ఉండి ప్రతిపక్ష స్థానంలోకి మారిన భారత రాష్ట్ర సమితి, ఎలాగైనా తెలంగాణలో బోణీ చేయాలని తహతహలాడిపోతున్న భారతీయ జనతా పార్టీల మధ్య ఈ సంకుల సమరం ప్రారంభమైంది.
తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా మిగతా అన్ని కులాల కంటే అధికమన్న విషయం తెలిసిందే. అందుకే ఈ స్థానిక పోరు సందర్భంగా ప్రధాన రాజకీయ పక్షాలన్నీ బీసీ రిజర్వేషన్లను అస్త్రంగా ప్రయోగిస్తున్నాయి. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు నిర్ణయిస్తూ తీర్మానం చేయడం, ఉత్తర్వులు జారీ చేయడం, గవర్నర్‌కు, కేంద్ర ప్రభుత్వానికి కూడా నివేదించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బీసీలకు తామే న్యాయం చేయగలమని చెప్పే విషయంలో ఒక అడుగు ముందున్నది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీలు లేకపోవడంతో కోర్టులు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేయడం, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన కేంద్రం దగ్గర పెండింగ్ లో పడటం కాంగ్రెస్ కు కలిసి వచ్చిన అంశం. స్థానిక సంస్థలలో కొంత బలం పెంచుకుని, వచ్చే ఎన్నికల నాటికి తమ సత్తా చాటాలనుకునే భారతీయ జనతా పార్టీ మాత్రం అయోమయంలో పడింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రంలో మాట్లాడుతున్న నేతలు, ఆందోళనలు సాగిస్తున్న వాళ్ళు కేంద్రాల్లో తామే అధికారంలో ఉన్నామన్న మాట మర్చిపోకూడదు కదా. వెనుకబడిన తరగతుల అభ్యున్నతి కోసం పోరాడిన నాయకుడిగా పేరు ఉండి, కొంతకాలం తెలుగుదేశం పార్టీతో ప్రయాణం చేసి, ఒక పర్యాయం ఆ పార్టీ శాసనసభ్యుడిగా ఉండి, తర్వాత వై యస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడై ఆ పార్టీ ఎన్నికల్లో ఓడిపోగానే రాజీనామా చేసి బిజెపిలో చేరి, ఆ పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడైన ఆర్. కృష్ణయ్య బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కావాలంటే తె లంగాణలో ఉద్యమాలు, ఆందోళనలు చేయడం కాదు.. ఢిల్లీలోని తన పార్టీ పెద్దల్ని ఒప్పించి పార్లమెంటులో రా జ్యాంగ సవరణ చేయిస్తే సరిపోతుంది కదా. ఇది కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డికి, సంజయ్ కి, ఆ పార్టీ తరఫున లోక్‌సభకు ఎన్నికైన మిగిలిన ఆరుగురు పార్లమెంట్ స భ్యులకూ, ఇతర నాయకులకూ వర్తిస్తుంది. ఇటీవలే ము గిసిన జూబ్లీహిల్స్ శాసనసభస్థానం ఉపఎన్నిక కిషన్‌రెడ్డి లోక్‌సభస్థానం పరిధిలోనిదికాబట్టి దాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉండేది, అది జరగలేదు.
ఇప్పుడివి రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు కాబట్టి తన శక్తిని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇటీవలే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన రామచంద్ర రావు మీద పడింది. బిజెపి పరిస్థితి ఇలా ఉంటే బీఆర్‌ఎస్ స్థితి వర్ణనాతీతం. వరుస ఓటములు, అగ్ర నాయకుడు క్రియాశీలకంగా లేని పరిస్థితి, వెలికి గురైన కుటుంబసభ్యురాలు సంధిస్తున్న అవినీతి అస్త్రాలు, పార్టీ శ్రేణుల్లో నిర్లిప్తత కలగలిసి ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక బీసీల రిజర్వేషన్ల విషయంలో ఆ పార్టీ చేస్తున్న వాదనలో పస లేదు. బీసీ రిజర్వేషన్లు 17 శాతం ఇచ్చారని ప్రతిపక్షాలు, లేదు, లేదు.. గిరిజన గ్రామ పంచాయతీలను తీసేస్తే (అక్కడ రిజర్వేషన్లు వర్తించవు కాబట్టి) బీసీ రిజర్వేషన్లు 21.39 శాతం అని ప్రభుత్వపక్షం వాదిస్తున్నాయి. ఎనిమిది జిల్లాల్లో గతంలో కన్నా బీసీ రిజర్వేషన్లు పెరిగాయని అధికారిక అంచనా.
తెలంగాణలో అధిక శాతం జనాభాగా ఉన్న వెనుకబడిన తరగతులను మచ్చిక చేసుకోవడానికి నానా అవస్థలూ పడుతున్న రాజకీయ పక్షాలు ఒక విషయం మర్చిపోతున్నాయి. అధికార కాంగ్రెస్ ప్రతిపాదించిన 42 శాతం రిజర్వేషన్లకంటే అధికంగానే బీసీలు తెలంగాణ గ్రామపంచాయతీలలో గెలుపొందుతున్నారన్నది వాస్తవం. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా ఎక్కువ సంఖ్యలో కనీసం గ్రామపంచాయతీల సర్పంచులు, మండల పరిషత్‌లలో ఎంపీటీసీలవరకైతే అధిక సంఖ్యలో బీసీలు ఎన్నికవుతున్నారు. 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రాతినిధ్యానికి సంబంధించిన వివరాలే కనుక చూసినట్లయితే తెలంగాణలో 12,728 గ్రామపంచాయతీల్లో 2625 పంచాయతీలు మాత్రమే బీసీలకు రిజర్వు కాగా 4274 మంది సర్పంచులు బీసీకి చెందినవారే గెలిచారు. అంటే రిజర్వేషన్ కంటే దాదాపు రెట్టింపు. సహజంగానే ఎక్కువ జనాభా ఉన్న కులాలవారే ఈ గ్రామస్థాయి ఎన్నికల్లో గెలుపొందడానికి అధికంగా అవకాశాలు ఉంటాయి. శాసనసభ, లోకసభ స్థానాల దగ్గరికి వచ్చేసరికి తక్కువ జనాభా ఉన్న అగ్రకులాల వారే ఎక్కువమంది ఎన్నికయి చట్టసభలకు వెళుతూ ఉండవచ్చు కానీ గ్రామపంచాయతీల స్థాయిలో పరిస్థితి భిన్నమని ఈ లెక్కలే చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కులాల వారి గణాంకాలు బయటకు వచ్చినప్పుడు ఈ విషయం మరోసారి స్పష్టం కాక మానదు. కాబట్టి బీసీల రిజర్వేషన్ల అంశం ఇకనైనా పక్కన పెట్టి రాజకీయపక్షాలు తమ మద్దతుదారులను ఎలా గెలిపించుకోవాలో ఆలోచిస్తే మంచిది.
చివరగా, 1981ప్రాంతాల్లో టంగుటూరి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఒకసారి గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. ఫలితాలు వెలువడిన వెంటనే వివిధ రాజకీయ పక్షాలు ఎవరెన్ని గెలిచారో లెక్కలు వేసుకోవడంలో తలమునకలై ఉండగా ముఖ్యమంత్రి అం జయ్య మాత్రం నదురుబెదురు లేకుండా గెలిచినవాళ్లంతా మా కాంగ్రెస్ వాళ్ళే అని ప్రకటించేశారు. పార్టీరహిత ఎన్నికలు కాబట్టి అధికారంలో ఉన్న అంజయ్యకు ఆ మాటలు కలిసి వచ్చాయి. అంజయ్య అన్నారని కాదు గాని, మరో మూడేళ్లు అ ధికారంలో ఉండే పార్టీతో వైరం పెట్టుకుని గ్రామపంచాయతీల సర్పంచులు సమస్యలు ఎందుకు కొని తెచ్చుకుంటారు? అధికార పార్టీకి జై అంటే సరిపోదా. రేపు గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అంజయ్య మాటనే తిరిగి వల్లె వేస్తే సరిపోతుంది.
