హైదరాబాద్: స్పష్టమైన అవగాహనతో విద్యుత్ రంగంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ప్రణాళికలు తయారు చేశామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేరాలని తీర్చిదిద్దుతున్నామని, సిఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సహచరులు కలిసి నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. తెలంగాణను ప్రపంచస్థాయి నగరంగా, రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని భట్టి అధికారులకు సూచించారు. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చేరడానికి పెట్టుబడులు రావాలని, ఉత్పత్తి రంగాలు అభివృద్ధి చెందితేనే ఆశించిన స్థాయిలో ఎకానమీ ఉంటుందని పేర్కొన్నారు. ఆ దిశగా విద్యుత్ తయారు చేసుకోవాలని ప్రణాళికలు చేస్తున్నామని,
పదేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం భారీగా పెరుగుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 10 శాతం విద్యుత్ డిమాండ్ పెరిగిందని, 2014లో పవర్ డిమాండ్ లో 6,755 మెగావాట్లు ఉండేదని చెప్పారు. 2025లో 18,138 మెగావాట్లకు పెరిగిందని, 2034 నాటికి 39,229 మెగావాట్లకు, 2025 నుంచి ప్రతి ఏటా 8.50 శాతం పెరుగుతుందని అన్నారు. 2047 నాటికి ప్రతి ఏటా 10 శాతం పవర్ గ్రోత్ అవసరం ఉంటుందని, విద్యుత్ ఉంటేనే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. భవిష్యత్తులో హైదరాబాద్ గ్లోబల్ హబ్ కు మారబోతోందని, 2047 నాటికి లక్ష మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని గుర్తుచేశారు. విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెరగాలని, ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి 24,760 మెగావాట్లు అని..విద్యుత్ స్టోరేజ్ పై ఇప్పటి వరకు ఎలాంటి ప్రణాళికలు చేయలేదని చెప్పారు. విద్యుత్ ను బ్యాటరీ స్టోరేజ్, పంప్ డ్ స్టోరేజ్ ల్లో అందుబాటులోకి తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. రాష్ట్రంలో 12 ప్రాంతాల్లో పంప్ డ్ స్టేరేజ్ పాయింట్లకు అవకాశం ఉందని, పంప్ డ్ స్టోరేజ్ కు తెలంగాణ అనుకూలమైన రాష్ట్రం అని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.