దాదాపు పదేళ్లకుగా పెండింగ్‌లో ఉన్న రామగుండం- మణుగూరు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పోరాట ఫలితంగానే రైల్వే సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయని హర్షం వ్యక్తం అవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిపిఆర్ ఇప్పటికే సిద్ధమైందని, సుమారు రూ. 4 వేల కోట్ల వ్యయంతో ఈ కొత్త రైల్వే మార్గాన్ని త్వరలో ప్రారంభించేందుకు రైల్వే శాఖ ముందుకు రావడం చారిత్రక పరిణామంగా వంశీకృష్ణ పేర్కొన్నారు. ఈ రైల్వే లైన్ సింగరేణి కార్మికులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు, బొగ్గు రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడతాయి. దేశంలోనే అతిపెద్ద పండగ అయిన సమ్మక్క సారక్క జాతరకు వెళ్ళే వేలాదిమంది ప్రయాణికులకు ఈ రైల్వే లైన్ గొప్ప అవకాశం. మంథని,మేడారం భక్తులకు ప్రత్యేక కనెక్టివిటీ పెరుగుతుంది. గత పదేళ్లలో వెనుకబడిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంలో భాగంగానే తాను ఈ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టాననిఎంపి వంశీకృష్ణ. తెలిపారు. పెద్దపల్లి- మంచిర్యాల ప్రాంతాల్లో రైల్వే లైన్స్, రోడ్లు, జాతీయ రహదారి 63 అభివృద్ధి తమ ప్రధాన అజెండా అని ఆయనన్నారు.