న్యూఢిల్లీ: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు దిత్వా తుఫాను ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతం శ్రీలంక, నైరుతి బంగాళాఖాతంకు దగ్గరగా ఉన్న తుఫాను కొంచెం తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని.. ఉత్తర తమిళనాడు-పుదుచ్చేరి తీరం వైపు నెమ్మదిగా కదులుతోందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. నవంబర్ 30 తెల్లవారుజామున తమిళనాడు, పుదుచ్చేరితోపాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు తుఫాను చేరుకుంటుందని అంచనా వేసింది. దిత్వా తుఫాను నేపథ్యంలో శనివారం తమిళనాడులోని పలు ప్రాంతాలకు ఐఎండి రెడ్ అలర్ట్ ప్రకటించింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరి, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో బలమైన ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు, అకస్మిక వరదలు కూడా వచ్చే ఛాన్స్ ఉందని హెచ్చరించింది.
శనివారం, తమిళనాడు తీరప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలో అతి భారీ వర్షాలు.. ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోని తమిళనాడులోని కడలూరు, మైలదుత్తురై, విల్లుపురం, చెంగల్పట్టు, పుదుచ్చేరిలకు ప్రాంతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. శనివారం ఉదయం నుండి ఆదివారం ఉదయం వరకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలలో 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.