మనతెలంగాణ/హైదరాబాద్ : కెసిఆర్ అనే మూ డు అక్షరాలు లేకుంటే తెలంగాణ లేదు అని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ వ్యాఖ్యానించా రు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు కెసిఆర్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగా ణ ఏర్పాటు కోసం కెసిఆర్ చేసిన దీక్షను తక్కువ చేసి మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు ఈ అంశాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు ఎ క్కడున్నారో తెలియదు అని, ఆయన కూడా ఇప్పు డు తెలంగాణ ఉద్యమం గురించి, కెసిఆర్ దీక్ష గు రించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కెసిఆర్ దీక్ష సమయంలో కేంద్రం లో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉన్నదని, తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేస్తూ కెసిఆర్ ను దీక్ష విరమించాలని వేడుకున్నారని గుర్తు చేశారు. కెసిఆర్ దొంగ దీక్ష అయితే ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు విరమించమని చెప్పిందని ప్రశ్నించారు. సింహం తన గాధను తాను చెప్పుకోకపోతే, వేటగాడు చెప్పే పిట్టకథనే నిజం అనుకుంటారని అన్నారు. తెలంగాణ బిడ్డల నెత్తురుతో కాంగ్రెస్ నేతల చేతులు తడిచాయని అన్నారు.
తెలంగాణ కథలో ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీనే విలన్ అని, తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్ పార్టీనే అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం దీక్షా దివస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం, ప్రొఫెసర్ జయ శంకర్ విగ్రహానికి దీక్షా దివాస్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరుల స్థూపానికి కెటిఆర్, బిఆర్‌ఎస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంఎల్‌సిలు బండ ప్రకాష్, దాసోజు శ్రవణ్, వాణీదేవి,మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఎల్‌ఎ ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, పార్టీ నేతలు మాగంటి సునీత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష, తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత బిఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి ప్రస్థానానికి సంబంధించిన అనేక అంశాలను వివరించారు. చరిత్రను మలుపు తిప్పిన రోజు కెసిఆర్ దీక్ష చేసిన రోజు అని పేర్కొన్నారు. కెసిఆర్ సచ్చుడో..తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కెసిఆర్ చేపట్టిన దీక్ష సునామీ సృష్టించిందన్నారు. కెసిఆర్ దీక్ష విఫలం కావాలని చాలా మంది ప్రయత్నం చేశారని చెప్పారు. తెలంగాణ ఉన్నంత కాలం కెసిఆర్ అనే పదాన్ని ఎవరూ తుడిచివేయలేరని స్పష్టం చేశారు.
గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది
కొందరు మూర్ఖులు కెసిఆర్ కనిపించడం లేదని అంటున్నారని.. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగానే ఉంటుందని అన్నారు. కెసిఆర్ ఎప్పుడు బయటకు రావాలో అప్పుడే వస్తారని తెలిపారు. నాయకుడిని నాయకుడే అంటారని.. అర్భకుడిని అర్భకుడే అంటారని వ్యాఖ్యానించారు.టైం బాగాలేనప్పుడు గ్రామ సింహాలు కూడా పులుల్లా గర్జిస్తాయంటూ ఎద్దేవా చేశారు. ఉద్యమంలో పట్టువిడుపులతో ముందుకు సాగిన కెసిఆర్ చాణక్యం వల్లనే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందని తెలిపారు. ఇందులో భాగంగా ఎన్నో పదవి త్యాగాలు, ఎన్నో రాజీనామాలు చేసిన పార్టీ బిఆర్‌ఎస్ అని పేర్కొన్నారు. తమ పార్టీ ప్రజా ప్రతినిధులు పదవులకు రాజీనామా చేస్తుంటే, కాంగ్రెస్ పార్టీ నేతలు పదవుల కోసం బానిస లెక్క పెదవులు మూసుకుని తెలంగాణకు విద్రోహం చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకొని ముందుకు పోతే, ఇప్పుడు తెలంగాణ ప్రజల అమ్మను తీసి కాంగ్రెస్ బొమ్మను ఆ పార్టీ నేతలు ప్రతిష్టించారని, తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను తీసివేశారని మండిపడ్డారు. దీక్షా దివాస్ సందర్భంగా మరోసారి తెలంగాణ తల్లిని తిరిగి సచివాలయంలో పునః ప్రతిష్ట చేసేందుకు ప్రతిజ్ఞ పూనాలని అన్నారు.
తెలంగాణకు మొదటి నుంచి కాంగ్రెస్ విలన్
ఎన్నడూ జై తెలంగాణ అననోళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని కెటిఆర్ మండిపడ్డారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి విలన్ పాత్ర పోషిస్తున్నది విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ ఒక్క పిలుపుతో పదవులను గడ్డిపోచల్లాగ విసిరేశామని అన్నారు. ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎంఎల్‌ఎలు వారు ఏ పార్టీలో ఉన్నారో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎంఎల్‌ఎలు రాజీనామా చేసి వస్తే అసలు విషయం అప్పుడు తెలుస్తుందని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి సోనియా గాంధీని బలిదేవత అన్నారని గుర్తు చేశారు. కానీ, కెసిఆర్ ఎంతో సంస్కారంతో అసెంబ్లీలో సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపారని చెప్పారు. రాజీవ్ గాంధీ విగ్రహం స్థానంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకుందామని దీక్షా దివస్ సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నామన్నారు. కాళేశ్వరం మీద కుట్ర జరిగిందని ఆరోపించారు.
మేడిగడ్డ బ్యారేజ్‌ను బాంబులు పెట్టి కూల్చివేసే ప్రయత్నం జరిగిందన్నారు. గులాంల ఎగురులాట కొంత కాలమే అని, వచ్చే కాలమంతా గులాబీలదే అని కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ ఉద్యమాన్ని, అమరవీరుల త్యాగాలను, ప్రజల పోరాటపటిమను గుర్తుచేసుకొని మరోసారి పునరంకితమవుదామని కెటిఆర్ పిలుపునిచ్చారు. దీక్షా దివాస్ అంటే కేవలం కెసిఆర్ దీక్ష చేసిన రోజు మాత్రమే కాదు అని, దీక్షా దివాస్‌ని ఎప్పటికప్పుడు ఒక దసరా, దీపావళి మాదిరి జరుపుకోవాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. దీక్షా దివాస్ సందర్భంగా తెలంగాణ సోయికి సాన పెట్టుకోవాలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని రగిలించుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయాలని కెటిఆర్ అన్నారు.
కెసిఆర్ ఉద్యమంపై డాక్యుమెంటరీ ప్రదర్శన
తెలంగాణ ఉద్యమం, కెసిఆర్ దీక్ష, 2009 నుంచి 2023 పాలన వరకు చేసిన ఉద్యమం, స్వరాష్ట్ర సాధన, గెలుపు, పదేళ్ల సంక్షేమంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ఉద్యమంపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు.