రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ జరుగుతున్న ఇందిరమ్మ చీరల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా చీరల పంపిణీని నిలిపి వేస్తున్నామని, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పంపిణీ పునః ప్రారంభం అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ శనివారం స్పష్టం చేసింది. కాగా ఇప్పటి వరకు ఇందిరమ్మ చీరల పంపిణీ దిగ్విజయంగా జరిగిందని తెలిపింది. ఈ నెల 19 నుంచి 25 వరకు కేవలం వారం రోజుల్లోనే 43,32,828 ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసినట్లు వెల్లడించింది. సెర్ప్‌లో 46 లక్షల 22 వేల 98 మంది మహిళా సభ్యులకు ఈ చీరల పంపిణీ పూర్తి చేసి కోటి మందికి చీరల పంపిణీ చేయాలన్న లక్షంలో 77.89 శాతం మంది సభ్యులకు చీరల పంపిణీ పూర్తి చేసినట్లు స్పష్టం చేసింది.
ఇదిలావుండగా స్వయం సహాయక సంఘాలు (ఎస్ హెచ్ జి)లో సభ్యులు కానీ మహిళలకు కూడా చీరల పంపిణీ నిర్వహించినట్లు తెలిపారు. వారికి వెంటనే సభ్యత్వం ఇచ్చి, మహిళలకు చీరలు అందజేసినట్లు స్పష్టం చేసింది. సుమారు రెండు లక్షల వరకు మహిళలకు ఎస్ హెచ్ జి నూతన సభ్యత్వం ఇచ్చి చీరలను అధికారులు పంపిణీ చేశారని పిఆర్ శాఖ వెల్లడించింది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి సభ్యత్వం కల్పించి చీరలు పంచుతున్నారని వివరించింది. ప్రస్తుతం గోదాముల్లో ఇంకా 16 లక్షల చీరలు అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. దీంతో పాటు సిరిసిల్ల నేతన్నలు తయారు చేసిన ఇందిరమ్మ చీరలను తయారైన వెంటనే జిల్లా కేంద్రాలకు అధికారులు పంపిస్తున్నారు. కోటి మంది మహిళలకు సభ్యత్వం ఇచ్చి, ప్రణాళికాబద్ధంగా కోటి చీరల పంపిణీని చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పిఆర్ శాఖ పేర్కొంది.