శ్రీలంకలో సంభవించిన వరదల్లో దాదాపు 56 మంది ప్రాణాలు కోల్పోవడంపై భారత ప్రధాని నరేంద్రమోడీ తీవ్ర సంతాపం తెలియజేశారు. దిత్వా తుపాను కారణంగ వరదలు ఆకస్మికంగా ముంచుకురావడంతో ఈ విపత్తు సంభవించింది. 21 మంది ఆచూకీ తెలియడం లేదు. ఈ ఆపద సమయంలో పొరుగు దేశానికి స్నేహ హస్తం అందించేందుకు భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలు భద్రంగా ఉండాలని, వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తన ఎక్స్ పోస్టులో తెలియజేశారు.
ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో అత్యవసర మానవతాసాయం పంపినట్టు ప్రకటించారు. భారత నేవీకి చెందిన మానవతాసాయం, వైపరీత్యాల సహాయ (హెచ్‌ఎడిఆర్) మిషన్ పొరుగునున్న దేశాలకు ఏ విపత్తు జరిగినా తక్షణం సహాయం అందిస్తుంది. ఈ ఆపరేషన్‌లో భారత్ నౌకలు, విమానాలు , వైద్యబృందాలు, పాల్గొంటున్నాయి. తీవ్ర వాతావరణ పరిస్థితుల కారణంగా బాధితుల సహాయ కార్యక్రమాలకు ఐఎన్‌ఎస్ విక్రాంత్ విమానాన్ని ఉపయోగించుకోవడానికి శ్రీలంక అభ్యర్థించిందని బారత అధికారులు శుక్రవారం వెల్లడించారు. శ్రీలంకలో నవంబర్ 30న అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష జరుగుతున్నందున భారత్ ఐఎన్‌ఎస్ విక్రాంత్ నౌక ఈనెల 2526 ప్రాంతంలో శ్రీలంకకు చేరిందని శ్రీలంక నేవీ వెల్లడించింది.