రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లను అడ్డుకున్నది బిజెపి నేతలేనని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పగటిపూట బిసిల గొంతు కోసిన బిజెపి నాయకులు ఇప్పుడు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. బిసిలకు రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నది బిజెపి నాయకులేనని ఆయన అన్నారు. వారు బిసి ద్రోహులు, వెన్నుపోటు దారులని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు సిఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందన్నారు. తాము పంపిన బిల్లులను ఆమోదించకుండా బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడ్డుపడటం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించకుండా నోరు మూసుకున్న బిజెపి నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఎగిరెగిరి పడుతుండటం హాస్యాస్పదమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ఎంపి లక్ష్మణ్‌కు సిఎంపై ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అసెంబ్లీలో బిసిబిల్లుకు మద్దతు ఇచ్చి ఢిల్లీలో మాట మార్చింది బిజెపి కాదా అని ఆయన ప్రశ్నించారు.
బిసిలకు తీరని అన్యాయం చేసింది బిజెపినేనని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలో బిసి బిల్లులను ఆమోదించాలని రాష్ట్ర కాంగ్రెస్ అధినాయకత్వం జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం పడిగాపులు కాశాయన్నారు. బిజెపి ద్రోహులను బిసిలు గమనించి సర్పంచ్ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. బిసి బిడ్డగా చెలామణి అవుతున్న లక్ష్మణ్ ఆ బిసిలకే తీరని ద్రోహం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి ఓబిసి సెల్ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్ బిసి బిల్లు ఆమోదించా లని ప్రధాని మోడీపై ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదన్నారు. తన పదవిపైన తప్ప బిసిలపైన ఇసుమంత ప్రేమ కూడా లక్ష్మణ్‌కు లేదన్నారు. గాంధీ కుటుంబం గురించి ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ప్రధాని పదవినే త్యాగం చేసిన చరిత్ర వాళ్లదని ఆయన అన్నారు. ఎప్పటికైనా తెలంగాణలో బిసి రిజర్వేషన్లు సాధించేది కాంగ్రెస్ పార్టీనేనని ఆది శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు.