మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పొలిట్ బ్యూరో సభ్యులు దేవ్‌జీతో సహా 50 మంది మావోయిస్టులు పోలీసుల అదుపులో ఉన్నారని, వారందరినీ కోర్టు హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) పేరుతో ఈ నెల 22వ తేదీన విడుదల అయిన లేఖ శుక్రవారం వెలుగులోకి వచ్చింది. లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లు అడవిలో జరిగింది నకిలీ ఎన్‌కౌంటర్ అని, దీనికి వ్యతిరేకంగా ఈ నెల 30వ తేదీన నిర్వహించే చత్తీస్‌గఢ్, దండకారణ్యం బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణీయ హిందూత్వ ఫాసిస్ట్ బిజెపి నరేంద్ర మోడీ, అమిత్ షా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కుమ్మక్కై, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డికె స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా, ఆయన జీవిత భాగస్వామి కామ్రేడ్ రాజేలను బంధించి దారుణంగా హింసించి హత్య చేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారన్నారు. దీన్ని దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని, న్యాయ విచారణకు డిమాండ్ చేస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాల వల్ల కలిగే నష్టానికి నిరసనగా, గిరిజన ప్రజలు నీరు, అడవులు, భూమి, ఉనికిని కాపాడుకోవడానికి పోరాడుతున్నారన్నారు. ఈ విషయంపై పోరాడుతున్న సిసి సభ్యులు కామ్రేడ్ కోసా దాదా, కామ్రేడ్ రాజు దాదా నకిలీ ఎన్‌కౌంటర్‌లో హత్యకు గురయ్యారని తెలిపారు. దండకారణ్యమంతా అన్యాయమైన యుద్ధ పరిస్థితిని ఎదుర్కొంటోందని, జాతీయ, అంతర్జాతీయ చట్టాలు తీవ్రంగా ఉల్లంఘింస్తున్నారని చెప్పారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న ప్రజా ఉద్యమాలను తుపాకీతో బెదిరించి అణిచివేస్తున్నారన్నారు. ఈ నెల 18, 19లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామారాజు జిల్లాలో జరిగిన రెండు నకిలీ ఎన్‌కౌంటర్లను ప్రజలంతా ఖండించాలని కోరారు. ఈ ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని లేఖలో డిమాండ్ చేశారు.