హైదరాబాద్: ఇప్పుడు దీక్షా దివస్ పేరుతో మరోసారి సెంటిమెంట్ రాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. తెలంగాణ సెంటిమెంట్ ను మాజీ సిఎం కెసిఆర్ వాడుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కెసిఆర్ చేసిన దీక్ష ఒక నాటకం అని కెసిఆర్ మూడు రోజులకే దీక్ష ముగించి పలాయనం చిత్తగించారని విమర్శించారు. కేవలం కెసిఆర్ దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, కాంగ్రెస్ వల్ల తెలంగాణ వచ్చిందని మహేష్ గౌడ్ తెలియజేశారు. దీక్షను మధ్యలోనే విరమిస్తే.. విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వచ్చిందని, పొట్టి శ్రీరాములు చేసిన దీక్షకు.. కెసిఆర్ దీక్షకు పొంతన లేదని అన్నారు.
ఉద్యమంలో ఎవరి బిడ్డలు చనిపోయారో అందరికీ తెలిసిందేనని, ఉద్యమ సమయంలో కెసిఆర్ కుటుంబంలో, బంధువుల్లో ఎవరైనా చనిపోయారా? అని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొన్న పేదలు, విద్యార్థులు, ఎస్సీలు, ఎస్టీలు ఆత్మార్పణం చేసుకున్నారని, పేదలు, విద్యార్థులు, ఎస్సిలు, ఎస్టిలు త్యాగాల వల్లే తెలంగాణ వచ్చిందని మహేష్ గౌడ్ పేర్కొన్నారు. పేదల త్యాగాల వల్ల వచ్చిన తెలంగాణను పదేళ్లపాటు కెసిఆర్ కుటుంబం దోచుకుందని ధ్వజమెత్తారు. ఆనాడు కిరోసిన్ పోసుకున్న బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదని అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దయ లేకుంటే తెలంగాణ వచ్చి ఉండేది కాదని, సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కెసిఆర్ సిఎం అయ్యేవారు కాదు అని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.