మన తెలంగాణ/ హైదరాబాద్: సొంత గడ్డపై సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఆతిథ్య భారత జట్టు వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. సిరీస్ ఆరంభానికి ముందు భారత్ ఫేవరెట్‌గా కనిపించింది. సౌతాఫ్రికా నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురు కాదని, టీమిండియా అలవోక విజయం సాధిస్తుందని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు జోస్యం చెప్పారు. పర్యాటక దక్షిణాఫ్రికాకు కూడా గెలుపుపై పెద్దగా ఆశలు లేవు. సిరీస్‌ను సమం చేస్తే చాలు అనే ఉద్దేశంతో భారత పర్యటనకు వచ్చింది. కానీ ఈడెన్ గార్డెన్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా అసాధారణ ఆటతో చెలరేగి పోయింది. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేసిన పోరాటాన్ని ఎంత పొగిడినా తక్కువే.
స్వల్ప లక్ష్యాన్ని సయితం కాపాడుకుంటూ మ్యాచ్‌లో చారిత్రక విజయం సాధించింది. సౌతాఫ్రికా టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన విజయంగా చిరకాలం తీపి జ్ఞాపకంగా మిగిలిపోతోంది. సొంత గడ్డపై భారత్‌ను 124 పరుగుల లక్ష్యాన్ని ఛేదించకుండా ఆపడంలో సౌతాఫ్రికా సఫలమైంది. సఫారీ బౌలర్లు అసాధారణ ప్రతిభతో తమ జట్టుకు చిరస్మరణీయ విజయం సాధించి పెట్టారు. ఇక గౌహతిలో కూడా సౌతాఫ్రికా మెరుగైన ఆటతో అలరించింది. భారత్‌ను మరోసారి ఒత్తిడిలోకి నెట్టడంలో సఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి వరుసగా రెండో టెస్టులోనూ జయకేతనం ఎగుర వేసింది. అంతేగాక 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత గడ్డపై టెస్టు సిరీస్‌ను దక్కించుకుంది.
కోలుకోవడం కష్టమే
దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం పాలైన టీమిండియాకు ఇప్పట్లో కోలుకోవడం అంత తేలిక కాదనే చెప్పాలి. స్వల్ప వ్యవధిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో టీమిండియా టెస్టుల్లో వైట్ వాష్‌కు గురైంది. దశాబ్దాల చరిత్ర కలిగిన భారత్ సొంత గడ్డపై జరిగిన సిరీస్‌లో ఇలాంటి ఘోర పరాజయాలను మూట గట్టుకోవడం ఇదే ప్రథమం. ఈ షాక్ నుంచి బయటపడి టెస్టుల్లో మళ్లీ విజయాల బాట పట్టడం అనుకున్నంత సులువు కాదని చెప్పొచ్చు. టీమిండియా పేలవమైన ప్రదర్శనకు ప్రధాన కోచ్ గౌతం గంభీర్ కారణమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సీనియర్ క్రికెటర్లపై అతను అనుసరిస్తున్న విధానం జట్టు ప్రస్తుత దుస్థితికి ఒక కారణంగా చెప్పక తప్పదు. అంతేగాక అనవసర ప్రయోగాలకు దిగుతూ జట్టు ఆత్మవిశ్వాసాన్ని కూడా పూర్తిగా దెబ్బతీశారు. ఇలాంటి స్థితిలో గంభీర్‌ను కోచ్ పదవి నుంచి తప్పించడమే మంచిదనే డిమాండ్ ఊపందుకుంది.