మన తెలంగాణ/హైదరాబాద్: కోకాపేట నియోపోలిస్ భూముల వేలం నయా రికార్డు నెలకొల్పిం ది. శుక్రవారం మరో రెండు ప్లాట్లకు హెచ్‌ఎండిఏ ఈ వేలం నిర్వహించగా కోట్లలో హెచ్‌ఎండిఏకు ఆదాయం సమకూరింది, నియోపోలిస్‌లోని 15, 16 నెంబర్ ప్లాట్లకు శుక్రవారం ఈ-వేలం జరిగిం ది. నియోపోలిస్‌లోని 15వ ప్లాట్‌కు ఎకరాకు రూ. 151.25 కోట్ల ధర పలకగా, ఈ ప్లాట్‌ను లక్ష్మీ నారాయణ గుమ్మడి, కార్తీశ్ రెడ్డి మద్గుల, శరత్ వెంట్రప్రగడ, శ్యామ్ సుందర్ రెడ్డి వంగాలలు ఈ వేలంలో ఈ ప్లాట్లను దక్కించుకున్నారు. ఇక, 16 ప్లాట్ ఎకరాకు రూ.147.75 కోట్ల ధర పలకగా, గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్ ఈ ప్లాట్‌ను సొంతం చేసుకుంది. ఈ రెండు ప్లాట్ల విక్రయం ద్వారా రా ష్ట్ర ప్రభుత్వానికి మొత్తం రూ.1,352 కోట్ల ఆ దాయం లభించింది. గతవారంలో నిర్వహించిన వేలంతో పాటు ప్రస్తుతం నిర్వహించిన ఈ వేలం ద్వారా ఇప్పటివరకు నియోపోలిస్ ఆక్షన్ల ద్వారా రూ.2,708 కోట్ల ఆదాయం హెచ్‌ఎండికు సమకూరింది. నియోపోలిస్‌లో శుక్రవారం
నిర్వహించిన ఈ వేలానికి సంబంధించి15వ ప్లాట్ 4.03 ఎకరాల విస్తీర్ణం ఉండగా, 16వ ప్లాట్ 5.03 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ బిడ్డింగ్ సాయంత్రం 6:30 గం టల వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఈ రికార్డు స్థాయి ఫలితాలతో, ఒక్క ఎకరానికి సగటు విలువ రూ.142.83 కోట్లకు చేరింది. ఇది హైదరాబాద్ భూముల మార్కెట్లో ఇప్పటివరకు కనిపించిన అత్యధిక పెరుగుదలని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. ప్రస్తుతం నియోపోలిస్ అభివృద్ధి చెందుతున్న ప్రాంతంగా డెవలపర్లు గుర్తించారు. రెండు విడతల్లో వరుసగా రికార్డు స్థాయిలో ఆదాయం రావడంతో డిసెంబర్ 03న నియోపోలిస్, డిసెంబర్ 05వ తేదీన గోల్డెన్ మైన్‌లో భూముల ఈ వేలాన్ని నిర్వహించడానికి హెచ్‌ఎండిఏ అధికారులు ఉత్సాహం చూపుతున్నారు. గతవారం 17, 18వ ప్లాట్లకు వేలం వేయగా ఎకరాకు రూ.137.25 కోట్ల ధర పలకగా దానిని మించి ఈ వారం ప్లాట్లకు మరో రూ.20 కోట్ల అధిక ధర పలకడం విశేషం.