‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ లోగోను ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. వచ్చే నెల 19వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరిగే 38వ హైదరాబాద్ బుక్ ఫేర్ లోగోని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రవీంద్రభారతిలో విడుదల చేశారు. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ సామాజిక రుగ్మతలను రూపుమాపి ప్రజల్లో పరివర్తన తీసుకువచ్చే దిశగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రభాతభేరి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఈ నేపథ్యంలోనే యువకులు, విద్యార్థుల్లో చైతన్యం కలిగించడానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో ప్రభాతభేరి పేరిట విస్తృత ప్రచారం నిర్వహించేందుకు ప్రత్యక స్టాల్,
హోర్డింగ్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు మంత్రి సూచించారు. అదే విధంగా తెలంగాణ పర్యాటక ప్రదేశాలు, సాంస్కృతిక శాఖ కార్యక్రమాల ప్రచార స్టాల్స్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు. దీనికి కోసం ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ కవి యాకూబ్ కార్యదర్శి వాసు, ఉపాధ్యక్షులు మలుపు బాల్ రెడ్డి, కోశాధికారి పన్యాల నారాయణరెడ్డి, కార్యవర్గ సభ్యులు భూమి శ్రీనివాస్, సాంస్కృతిక సలహా మండలి సభ్యులు ముచ్చర్ల దినకర్, తదితరులు పాల్గొన్నారు