హాంకాంగ్: హాంకాంగ్‌లోని తాయ్ పో జిల్లాలోని ఎత్తైన అపార్ట్‌మెంట్ భవనాల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య 55కి పెరిగిందని అధికారులు తెలిపారు. దీనిని, హాంకాంగ్ చరిత్రలోనే అత్యంత దారుణమైన అగ్నిప్రమాదంగా పేర్కొన్నారు. బుధవారం మధ్యాహ్నం వాంగ్ ఫక్ కోర్టు కాంప్లెక్స్‌లోని 32 అంతస్తుల భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవించింది.
మంటల్లో ఐదు భారీ టవర్స్ పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు 279 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఘటనాస్థలంలో అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని రక్షించిన సహాయక బృందాలు.. భవనాల్లో చిక్కుకున్న మిగతావారిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గురువారం ఉదయం నాటికి నాలుగు భవనాల్లో మంటలు నియంత్రణలోకి వచ్చినట్లు అగ్నిమాపక సేవల విభాగం తెలిపింది. కాగా, ఈ అగ్నిప్రమాదానికి సంబంధించి నరహత్య అనుమానంతో ముగ్గురు వ్యక్తులను హాంకాంగ్ పోలీసులు అరెస్టు చేశారు.