బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తన ధ్వంద్వ నీతిని అమలు చేస్తూ తడిగుడ్డతో బీసీల గొంతుకోసిందని రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మొదటి నుంచి చెప్పిన కాంగ్రెస్ పార్టీ చివరికి చేతులెత్తేసి భస్మాసుర హస్తంగా మారిందని దుయ్యబట్టారు. పంచాయతీ ఎన్నికల్లో జీవో నెం.46 తీసుకొచ్చి బీసీలను దగా చేస్తోందని మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో రాజ్యసభ సభ్యుడు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కె. లక్ష్మణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బీసీలకు 42 శాతం కాదు, కనీసం 20 శాతం కూడా ఇవ్వకుండా కేవలం 17 శాతం మాత్రమే కేటాయించిందని ఆవేదన వ్యక్తం చేశారు. కులగణన, సర్వేలు, కోటా కోసం నివేదికలు, అసెంబ్లీలో బిల్లులు, ఢిల్లీలో ధర్నాలు, ఆర్డినెన్స్లు, జీవోలు అంటూ వెనుకబడిన వర్గాలను మైమరిపించి, ఆశలు రేకెత్తించి చివరికి బీసీలకు వెన్నుపోటు పొడిచారని అన్నారు. కులగణన సర్వే పేరిట రూ.200 కోట్లు ఖర్చు చేశారు, ఏమైంది? కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.
పాలాభిషేకం, పూలాభిషేకం చేశారు..? ఇప్పుడేమంటారు..?
తెలంగాణలో కొంతమంది కాంగ్రెస్ మాటలు నమ్మి 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తారని రేవంత్ రెడ్డికి పాలాభిషేకం, పూలాభిషేకం చేసి రేవంత్ గౌడ్ అన్నరు, రేవంత్ యాదవ్ అన్నరు, రేవంత్ ముదిరాజ్ అన్నరు అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఏమైంది? బీసీలను కాంగ్రెస్ దోఖా చేసిందని మండిపడ్డారు. బీసీల సంక్షేమం, న్యాయం కాంగ్రెస్ ఆలోచనలో లేదని, నెహ్రూ కుటుంబమే ప్రధానంగా వారి ఆలోచన అని విమర్శించారు. బిహార్ ఎన్నికల్లో ఓట్ల కోసం తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని కాంగ్రెస్ అబద్ధాలు ప్రచారం చేసిందని ఆరోపించారు. కానీ అక్కడి ప్రజలు వాటిని నమ్మకుండా కాంగ్రెస్‌ను తిరస్కరించారని అన్నారు. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్లు దేశవ్యాప్తంగా చెప్పుకుంటూ తిరుగుతున్న రాహుల్ గాంధీ చేస్తున్న మోసాన్ని దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.
రాజ్యాంగ మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆంక్షలు, అమల్లో ఉన్న చట్టాలు అన్నీ పరిగణనలోకి తీసుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం కాంగ్రెస్ అలవికాని హామీలను గుప్పించిందని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చే కేవలం రూ.2,300 కోట్ల నిధుల కోసం మాత్రమే స్థానిక ఎన్నికలకు సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. కోర్టులో బీసీ రిజర్వేషన్ల అంశంపై విచారణ నడుస్తున్నప్పటికీ ఎన్నికలు హడావుడిగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఎన్టీ రామారావు హయాంలో 1988లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఉంటే ఇప్పుడు వాటిని కేవలం 17 శాతానికి తగ్గించారని ఆరోపించారు. పార్టీ పరంగా కాంగ్రెస్ అభ్యర్థులకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పడం అంటే ఎవరిని మభ్యపెడుతున్నారని ప్రశ్నించారు.