మనతెలంగాణ/హైదరాబాద్:నేటి నుంచి భారత విమానయాన రంగం కొత్త పుంత లు తొక్కనుందని, సాఫ్రాన్ కంపెనీకి చెందిన ఈ కొత్త కేంద్రం భారత్‌ను ఒక గ్లోబల్ ఎంఆర్‌ఓ (నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర మార్పు) కేంద్రంగా మార్చేందుకు సహాయపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ఈ ఎంఆర్‌ఓ కేం ద్రం ఆధునిక సాంకేతిక విమానాయాన రంగంలో యువతకు కొత్త అవకాశాలను కూడా సృష్టిస్తుందని ప్రధానమంత్రి తెలిపారు. హైదరాబాద్‌లోని శంషాబాద్ సమీపంలో బుధవారం జీఎంఆర్ ఏరో పార్క్ (సెజ్)లో సాఫ్రాన్ ఏర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, సాఫ్రాన్ చైర్మన్ రాస్ మెక్‌ఇన్నెస్‌లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ దేశంలో సాఫ్రాన్ పెట్టుబడులు ఇదే వేగంతో కొనసాగుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా సాఫ్రాన్ బృందానికి ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఇటీవల కాలంలో భారతదేశ విమానయాన రంగం అపూర్వమైన వేగంతో పురోగమించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ విమానయాన మార్కెట్‌లో భారత్ ఒకటిగా ఉందని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశీయ విమానయాన మార్కెట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మూడో అతిపెద్ద మార్కెట్‌గా ఉందని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజల ఆకాంక్షలు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయని ఆయన తెలిపారు. వాటి ఫలితంగా దేశంలో విమాన ప్రయాణానికి డిమాండ్ పెరుగుతోందన్నారు. ఈ డిమాండ్‌ను తీర్చడానికి విమానయాన సంస్థలు పనిచేసే విమానాల సంఖ్యను నిలకడగా పెంచుతున్నాయని ఆయన తెలిపారు. భారతీయ విమానయాన కంపెనీలు 1,500ల కంటే ఎక్కువ కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ ‘డిజైన్ ఇన్ ఇండియా’ను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నట్లు ప్రధానమంత్రి తెలిపారు. భారత్‌లో విమాన ఇంజన్, విడిభాగాల రూపకల్పన విషయంలో సాధ్యాసాధ్యాలను అన్వేషించాలని ఆయన శాఫ్రాన్ బృందాన్ని ప్రధాని కోరారు. ఈ ప్రయత్నంలో దేశంలోని విస్తారమైన ఎంఎస్‌ఎంఈ నెట్‌వర్క్, ప్రతిభావంతులైన యువత నుంచి ప్రధానంగా మద్దతు అందుతుందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.
బెంగళూరు- టు హైదరాబాద్‌ను డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ కారిడార్‌గా ప్రకటించాలి
ఎరోస్పేస్, ఏవియేషన్ హబ్‌గా హైదరాబాద్ ఎదుగుతోందని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. యువతను తీర్చిదిద్దడానికి నైపుణ్యశిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని, – సాఫ్రాన్ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. సాఫ్రాన్ సంస్థ ఏర్పాటు హైదరాబాద్ అభివృద్ధిలో కీలక మైలురాయిగా ఉంటుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఫ్రెంచ్ సంస్థకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. హైదరాబాద్‌ను ఎంచుకున్న సాఫ్రాన్ సంస్థకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. జీఎంఆర్ ఏరో పార్క్ (సెజ్)లో సాఫ్రాన్ ఏర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీ ఏర్పాటుతో హైదరాబాద్ అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల భారత వైమానిక, నావికాదళానికి మేలు జరుగుతుందని ఆయన తెలిపారు. ఏవియేషన్‌కు చెందిన ఎన్నో సంస్థలు ఇప్పటికే హైదరాబాద్‌లో నెలకొన్నాయని, ఏవియేషన్, ఎరోస్పేస్‌కు చెందిన ఉన్నత నిపుణులు కూడా హైదరాబాద్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్, బెంగళూర్‌ల మధ్య వైమానిక, రక్షణరంగం కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రధానిని సిఎం కోరారు.
రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు
భారతదేశంలో లీప్ ఇంజన్ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌ఆల్ (ఎంఆర్‌ఓ) సెంటర్ ఇదే కావడం విశేషమని సిఎం రేవంత్ తెలిపారు. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో వెయ్యి మందికి పైగా నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లకు ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. సాఫ్రాన్ సంస్థకు చెందిన ఎం88 మిలిటరీ ఇంజన్ ఎంఆర్‌ఓకు శంకుస్థాపన చేసిందని ఇది భారత వైమానిక దళం, భారత నావికాదళానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తెలంగాణలో 25 కంటే ఎక్కువ ప్రధాన ప్రపంచ కంపెనీలు, 1,500కు పైగా ఎంఎస్‌ఎంఈలు ఉన్నాయని సిఎం పేర్కొన్నారు. తమ ప్రభుత్వ ప్రగతిశీల పారిశ్రామిక విధానం దేశంలోనే అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచిందని ఆయన తెలిపారు. తమ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, ఏరోస్పేస్ పార్కులు, సెజ్‌లు ప్రముఖ ప్రపంచ కంపెనీల నుంచి అనేక భారీ పెట్టుబడులను ఆకర్షించాయని సిఎం రేవంత్ పేర్కొన్నారు.
గ్లోబల్ సమ్మిట్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నాం
సాఫ్రాన్, బోయింగ్, ఎయిర్‌బస్, టాటా, భారత్ ఫోర్జ్ వంటి సంస్థలు హైదరాబాద్‌ను తయారీ, పరిశోధన, అభివృద్ధి కోసం ఎంచుకున్నాయని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఏరోస్పేస్, రక్షణ రంగంలో మన ఎగుమతులు గత ఏడాదికన్నా రెట్టింపు అయ్యాయని, 9 నెలల్లో రూ.30,742 కోట్లకు చేరుకున్నాయని ఆయన తెలిపారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ ఏరోస్పేస్ అవార్డును పొందిందని సిఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో 30 వేల ఎకరాల విస్తీర్ణంలో తాము భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తమ విజన్‌ను ఆవిష్కరించడానికి డిసెంబర్ 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే తెలంగాణ రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. 2035 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సంస్థ ఏర్పాటుతో విదేశీ మారకపు ఖర్చులు ఆదా
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్‌నాయుడు
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన జీఎంఆర్ ఏరో పార్క్ (సెజ్)లో సాఫ్రాన్ ఏర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ ఫెసిలిటీతో రానున్న రోజుల్లో విదేశీ మారకపు ఖర్చులను ఆదా చేస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రాంమోహన్‌నాయుడు అన్నారు. విమాన నిర్వహణ, కార్యకలాపాలకు దేశం ప్రాధాన్యత ఇస్తుందని, రానున్న రోజుల్లో ఇది గమ్యస్థానంగా మారుతుందని ఆయన తెలిపారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పౌరవిమానయాన మార్కెట్‌లో భారతదేశం ఒకటిగా నిలుస్తుందని ఆయన అన్నారు. దేశీయ విమానయాన సంస్థలు 1,500ల కంటే ఎక్కువ విమానాలకు ఆర్డర్‌లు ఇచ్చాయని ఆయన తెలిపారు. సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ సర్వీసెస్ దేశ, స్వదేశీ సామర్థాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.