ఢాకా: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు బిగ్ షాక్ తగిలింది. మూడు అవినీతి కేసుల్లో ఆమెకు బంగ్లాదేశ్ కోర్టు గురువారం 21 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని BSS వార్తా సంస్థ ప్రకారం.. పుర్బాచోల్‌లోని రాజుక్ న్యూ టౌన్ ప్రాజెక్ట్‌లో ప్లాట్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయనే ఆరోపణలపై ఈ మూడు కేసులు హసీనాపై దాఖలు చేయబడ్డాయి. మూడు కేసుల్లో ప్రతి కేసులోనూ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఢాకా స్పెషల్ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసుల్లో షేక్ హసీనా కొడుకు, కూతురికి కూడా కోర్టు శిక్ష విధించింది. ఆమె కుమారుడు సజీబ్ వాజెద్ జాయ్ కు కోర్టు ఐదు సంవత్సరాల జైలు శిక్ష, లక్ష టాంకుల జరిమానా విధించగా.. కుమార్తె సైమా వాజెద్ పుతుల్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
ఢాకాలోని పుర్బాచల్ ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన ప్లాట్లను చట్టవిరుద్ధంగా కేటాయించారనే ఆరోపణలపై బంగ్లాదేశ్ అవినీతి నిరోధక కమిషన్ (ACC) గత జనవరిలో షేక్ హసీనా, ఆమె కుటుంబ సభ్యులపై ఆరు వేర్వేరు కేసులు దాఖలు చేసింది. మిగిలిన మూడు కేసుల తీర్పు డిసెంబర్ 1న రానుంది. ఇదిలావుంటే.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు సంబంధించిన ఘటనలో మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించిన బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) జూలై 2024న షేక్ హసీనాకు మరణశిక్ష విధించింది.