ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఓఎస్‌డి రాజశేఖర్ రెడ్డిని సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు గురువారం విచారించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో సుమారు రెండు గంటల పాటు ఆయన్ను విచారించిన అధికారులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. గత ఏడాది మార్చిలో అప్పటి టాస్క్‌ఫోర్స్ డిసిపి రాధకిషన్ రావు స్టేట్‌మెంట్ ఆధారంగా సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాధా కిషన్ రావు స్టేట్‌మెంట్‌లో మాజీ సిఎం కెసిఆర్ పేరు ప్రస్తావనకు వచ్చిందని, కెసిఆర్ కుటుంబ సభ్యులు, బిఆర్‌ఎస్‌లో సన్నిహితుల వ్యవహారాలు చక్కబెట్టేందుకు తాము పని చేశామని గతంలో రాధా కిషన్ రావు వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో కెసిఆర్ ఓఎస్‌డి రాజశేఖర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను సైతం అధికారులు రికార్డు చేశారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు నిందితులతో పాటు, భారీ సంఖ్యలో బాధితులను విచారించారు.