కర్ణాటకలో ప్రజా సమస్యల పరిష్కారం కన్నా పదవుల కోసం ఆరాటమే ప్రధానంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కుర్చీ కోసం రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు ఆగడం లేదు. ఒకపక్క ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మరోవైపు డిప్యూటీ సిఎం డికె శివకుమార్ మధ్య అధికార పంపిణీ ఫార్ములాపై గందరగోళం నెలకొంటోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా డికె శివకుమార్‌ను బుజ్జగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రాజకీయ సంక్షోభం ఎలా ఉన్నా రాష్ట్రంలోని ఎన్నో సమస్యలు ఎక్కడవేసినగొంగళి అక్కడే అన్నట్టు ఉంటున్నాయి. ముఖ్యంగా మొక్కజొన్నకు కనీస మద్దతు ధర కల్పనలో రైతుల డిమాండ్ ఇప్పుడు తీవ్ర సమస్యగా ఉంటోంది. ఈ విషయంలో విపక్షం బిజెపి నేతలు రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేకి అని చిత్రించడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప కేంద్ర అధిష్ఠానంతో ఈ సమస్యల పరిష్కారానికి చర్చించేందుకు ధైర్యం వహించడం లేదు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 3000 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉత్తర కర్ణాటకలోని గడగ్ జిల్లా రైతులు గత పదిరోజులుగా నిరవధిక దీక్ష సాగిస్తున్నారు. పొరుగు జిల్లాల రైతులు కూడా వీరికి మద్దతుగా దీక్షలు ప్రారంభించారు.
కర్ణాటకలో ఇదివరకు క్వింటాలు మొక్కజొన్నకు కనీస మద్దతు ధర రూ. 1600 నుంచి రూ. 1800 వరకు ఉండగా కేంద్ర ప్రభుత్వం రూ. 2400 వరకు కనీస మద్దతు ధరను నిర్ణయించింది. సెప్టెంబరు నుంచి ఈ ధరలు తగ్గుముఖం పట్టడం ప్రారంభమై గత పదిహేను రోజుల్లో అకస్మాత్తుగా మరింత తగ్గిపోయాయి. వరదలవల్ల దెబ్బతిన్న పంటల నుండి ఇప్పుడిప్పుడే రాష్ట్రం తేరుకొంటున్న పరిస్థితుల్లో మొక్కజొన్న రైతుల నిరసన ప్రారంభం అయింది. చెరకు పంటకు టన్ను ఒక్కింటికి న్యాయమైన, లాభదాయకమైన ధర రూ. 3500 వంతున చెల్లించాలని చెరకు రైతులు దీక్షలు చేపట్టిన తరువాత మొక్కజొన్న రైతుల దీక్షలు ప్రారంభమయ్యాయి. చెరకు టన్నుకు రూ. 3300 వంతున చెల్లిస్తామని కర్ణాటక ప్రభుత్వం ఇటీవలనే చెరకు రైతులను ఒప్పించగలిగింది. త్వరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో విపక్షం బిజెపి ఈ రైతుల నిరసనలను ఒక అవకాశంగా చేసుకుని అధికార పార్టీ ప్రధాన స్వభావం రైతులకు వ్యతిరేకం అని చిత్రించడానికి సిద్ధంగా ఉంది. మొక్కజొన్న, చెరకు రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వమే చొరవతీసుకోవాలని అధికార పార్టీ కాంగ్రెస్ వాదిస్తోంది.
కేంద్రంలో తమ పార్టీ నాయకుల వద్ద ఈ అంశాన్ని లేవనెత్తడానికి విపక్ష బిజెపి ఎంపిలకు ధైర్యం లేదని కాంగ్రెస్ ఎగతాళి చేస్తోంది. మొక్కజొన్న, పెసలు ధరలు పతనమవుతున్నందున వీటి ప్రొక్యూర్‌మెంట్ విషయంలో జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య గత వారం లేఖ రాశారు. ధర మద్దతు స్కీమ్ లేదా మరో అనువైన వ్యవస్ధ ద్వారా తక్షణం ప్రొక్యూర్‌మెంట్‌ను ప్రారంభించేలా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(నాఫెడ్), నేషనల్ కో ఆపరేటివ్ కన్సూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సిసిఎఫ్) లను ప్రధాని మోడీ ఆదేశించాలని కోరారు. విదేశాల నుంచి ఈ పంటల దిగుమతులు పెంచడం కూడా ఈ సంక్షోభానికి కారణంగా ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య వాదిస్తున్నారు. దీనికి స్పందనగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహారప్రజా పంపిణీ కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తన లాబీ బంతిని రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకే విసిరారు. కనీస మద్దతు ధర లేదా లాభదాయక, న్యాయమైన ధరల కల్పన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
దిగుమతులే ఈ సంక్షోభానికి కారణమన్న సిద్ధరామయ్య వాదనను తోసిపుచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 0.5 లక్షల మెట్రిక్ టన్నులే దిగుమతులు అయ్యాయని సమాధానం ఇచ్చారు. కేంద్ర, రాష్ట్రాల రాజకీయ నిందారోపణల డ్రామా ఫలితంగా రైతుల ప్రధాన సమస్యలు పరిష్కారం కాకుండా మరుగున పడిపోతున్నాయి. కర్ణాటకలో మొక్కజొన్న సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం ఈ ఏడాది సరఫరా డిమాండ్ మధ్య వ్యత్యాసం, ప్రపంచ తృణధాన్యాల ధరల అస్థిరత, తదితర అనేక కారణాల వల్ల ధరలు బాగా దిగజారాయి. ఈథనాల్ బ్లెండింగ్ ఫలితాలు కూడా అనుకున్న విధంగా రాలేదు. ఫలితంగా మొక్కజొన్న మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు గురవుతోంది. 2025 ఖరీఫ్ సీజన్‌లో కర్ణాటకలో 55 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి కాగా, 32 లక్షల టన్నుల వరకు మార్కెట్ చేయగల అత్యధిక మిగులు స్థాయిలో మొక్కజొన్న ఉంది.
ఇది స్థానిక పరిశ్రమల శోషణ సామర్థాన్ని మించి పోయింది. అంటే స్థానిక పరిశ్రమల అవసరాలకు మించి ఉంది. ఇదివరకటి సంవత్సర ప్రొక్యూర్‌మెంట్‌తో డిస్టిలరీల్లో ప్రస్తుతం ఉన్న అదనపు నిల్వలతో ఇప్పుడు ఈ పంటను తీసుకోవడం చాలా సమస్యగా తయారైంది. ఈ సంక్షోభంలో కనీస మద్దతు ధర కింద రాష్ట్ర ప్రభుత్వం మొక్కజొన్న పంట ప్రొక్యూర్‌మెంట్ చేస్తుందని ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య సానుకూలంగా హామీ ఇచ్చినప్పటికీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ లేదు. ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న వినియోగించేందుకు నాఫెడ్, ఎన్‌సిసిఎఫ్‌లతో ఒప్పందం కుదుర్చుకోవాలని రాష్ట్రం లోని డిస్టిలరీలకు ఆయన లిఖిత పూర్వకంగా సూచించినా, ఇంకా పనులు జరగడం లేదు. కర్ణాటకలో ముఖ్యంగా సెంట్రల్, ఉత్తరాది జిల్లాల్లో అత్యధికంగా మొక్కజొన్నను పండించిన రైతులు తమ సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ ప్రణాళికతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఈ డిమాండ్ అధికార, విపక్ష నాయకుల నిర్వాకంతో నెరవేరే అవకాశం కనిపించడం లేదు.