మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ గురువారం ప్రారంభమయ్యాయి, తొలిరోజు సర్పంచ్ స్థానాలకు 3,242, 1,821 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి విడతలో 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు ఎన్నికలు జరుగనుండగా, ఈ నెల 29 వరకు నామపత్రాలు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది. ఉదయం 10.30 నుంచి సా యంత్రం 5 వరకు నామినేషన్లు సమర్పింవచ్చు. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. డిసెంబర్ 3 వరకు ఉపసంహరణ గడువు ఉంది.
అదేరోజు పోటీ లో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. డిసెంబర్ 11న ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ఉంటుంది. అదేరోజు మధ్యాహ్నం ఓట్లు లెక్కించి వార్డు సభ్యులు, సర్పంచి ఫలితాలు వెల్లడిస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం టిఇ పోల్ అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పౌరులు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే ఫిర్యాదులను సులభంగా అప్‌లోడ్ చేసి, వాటిని ట్రాక్ చేయవచ్చని పేర్కొంది.
ఎన్నికల నియమావళి పరిశీలనకు స్క్రీనింగ్ కమిటీ
రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పరిశీలనకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు కార్యదర్శులను సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కమిటీలో పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలన విభాగం ముఖ్యకార్యదర్శి లేదా కార్యదర్శులతో పాటు, మరొక విభాగం కార్యదర్శి సభ్యులుగా ఉంటారు.