ఇమ్రాన్ ప్రాణాలతో ఉన్నట్లా లేనట్లా
పాక్ సైన్యంచేతిలో అంతం అయ్యాడా?
సైనిక చీఫ్ మునీర్ సైగలతోనే లాకప్ డెత్?
అఫ్ఘన్…ఖైబర్ ప్రాంత మీడియా అధికారుల వెల్లడి
కట్టుదిట్టమైన అడియాలా జైలువద్దకు జనం రాక
ఎటువంటి ప్రకటన వెలువరించని పాక్ ప్రభుత్వం
ఇస్లామాబాద్ : క్రికెట్ బ్రాండ్, పాకిస్థాన్ రాజకీయాల్లో సంచలనమై, పాకిస్థాన్ తెహరీక్ ఏఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ పెట్టి ప్రధాని అయిన ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు? ఏ స్థితిలో ఉన్నాడు? అనేది పాక్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా తీవ్రసంచలనం అయింది. అత్యంత అల్ప స్థాయి అవినీతి ఆరోపణలపైనే జైలుపాలయిన ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా మూడు సంవత్సరాలుగా రావల్పిండిలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కంచుకోట వంటి జైలు అడియాలా కారాగాచంలో మగ్గిపోతున్నాడు. అయితే ్రఇమాన్ ఖాన్‌ను జైలులోనే తీవ్రంగా హింసించి పాక్ సైనిక వర్గాలు ఆయన ఏకాంత సెల్‌లోనే మట్టుపెట్టారనే వార్తలు పాక్ అంతటా వ్యాపించాయి. ఇప్పుడు ఈ జైలు వెలుపల అత్యధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు వచ్చి చేరుతున్నారు. మంగళవారం రాత్రి నుంచే జైలు ఆవరణ అంతటా జనం కోపోద్రిక్తులై నింది పోయి ఉన్నారు.
జైలులోనే ఇమ్రాన్‌ను చంపివేయాలని పాకిస్థాన్ శక్తివంత సైనిక విభాగం అధినేత జనరల్ అసిమ్ మునీర్ ఇటీవల ఆదేశించారని, ఈ మేరకు తరువాతి క్రమంలో ఇమ్రాన్‌ను మట్టుపెట్టారని ప్రచారం జరుగుతోంది. తమ నేత ఎక్కడున్నాడు? తమకు చూపించాలని కోరుతూ జైలు పరిసరాలలో జనం చేరుకుని నినాదాలకు దిగుతున్నారు. ఇమ్రాన్ ఖాన్ సోదరిలు కూడా ఆయన పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇక బెలూచిస్తాన్, అఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రిత్వశాఖల నుంచి కూడా సోషల్ మీడియా ద్వారా ఇమ్రాన్ హత్య జరిగిందనే ప్రకటనలు వెలువడుతున్నాయి. వీటిని జనం ఎక్కువగా విశ్వసిస్తున్నారు. ఖాన్‌ను కస్టడీలో చంపేశారని వదంతులు రావడంతో పలు దేశాలలో ప్రత్యేకించి దుబాయ్ ఇతర ప్రాంతాలలో దీని నిర్థారణకు దౌత్యవర్గాలు యత్నిస్తున్నాయి.
జైలులోనే ఆయనను చంపివేసి, తరువాత భౌతిక కాయాన్ని గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకువెళ్లారని అఫ్ఘనిస్థాన్ మీడియా వార్తలు వెలువరించింది. అయితే ఇమ్రాన్ మృతి వార్తలను లేదా ఆయన లాకప్ డెత్ గురించి ఎక్కడ కూడా అధికారిక నిర్థారణ జరగలేదు. పాకిస్థాన్ అధికార వర్గాలు ఇప్పటివరకూ దీనిపై ఎటువంటి స్పందన వెలువరించలేదు. ఇమ్రాన్ సజీవంగా ఉంటే తరువాత రాజకీయంగా తమకు ఎదుర్కొనేందుకు వీలుందని పాక్ సైన్యం నిర్థారించుకుంది. దీనిని ఐఎస్‌ఐ బలపర్చింది, దీనితోనే జైలులోపలికి సైనిక వర్గాలు చేరుకుని వీలును చూసుకుని మట్టుబెట్టినట్లు తేలింది.
ఖండనలేదు..నిర్థారణ లేదు…షరీఫ్‌లు మౌనం
అయియితే పాకిస్థాన్ ప్రభుత్వం కానీ, సైనిక వర్గాలు కానీ ఇమ్రాన్ ఖాన్ విషయంపై ఎటువంటి ప్రకటన వెలువరించలేదు. గత రెండు మూడు రోజుల క్రితం అంతర్జాతీయ మీడియా సంస్థ ఒకటి ఇమ్రాన్ ఆసుపత్రిలోలేదా జైలులో అత్యంత బలహీనమైన స్వరంతో మీడియాతో మాట్లాడుతూ ఉండటం, ఈ దశలో ఆయన పూర్తిగా శారీరక అంత్య లక్షణాలతో ఉండటం కన్పించింది. జైలులో చాలాకాలంగా ఉంటూ వస్తున్న ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై అనేక నెలలుగా ఎటువంటి అధికారిక బులెటిన్ వెలువడలేదు. ప్రభుత్వ పరమైన రాజకీయ వ్యవస్థను క్రమేపీ శాసిస్తూ వస్తోన్న సైనిక ప్రధానాధికారి మునీర్ ప్రాబల్యం క్రమంలోనే ఈ విధంగా పాక్ అధికారిక ప్రకటనలను తొక్కిపెట్టారని వార్తలు వెలువడుతున్నాయి.
తాను జైలు వద్దకు వెళ్లి ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు అనుమతి కోరానని, అయితే ఇందుకు నిరాకరించారని ఇటీవలే ఖైబర్ ఫక్తూన్‌క్వా ముఖ్యమంత్రి సొహైల్ అఫ్రిది ప్రకటన వెలువరించారు. తాను ఏడుసార్లు ఆయనను కలిసేందుకు యత్నించినా, వెనకకు పంపించారని తెలిపారు. జైలు వెలుపల ఉన్న సైనిక అధికారి ఒకరు తనను మర్యాదపూర్వకంగా బయటకు తరలించారని చెప్పారు. కాగా తాను సోదరుడి కోసం ఆందోళన చెంది తన అక్కాచెల్లెళ్లతో వెళ్లానని డాక్టర్ ఉజ్మా ఖాన్ తెలిపారు. అయితే తనతో పాటు ఇతరులను పోలీసు, సైనిక అధికారులు జుట్టుపట్టుకుని లాక్కెళ్లారని ఆమె రోదిస్తూ తెలిపింది. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కుందామని వెళ్లితే ఈ విధంగా వ్యవహరించడం ఏం న్యాయం అని ప్రశ్నించారు. ఆయన ఉన్నదీ లేనిది అయినా తమకు తెలియాల్సి ఉందని తెలిపారు.