తెలంగాణ ప్రభుత్వం ఎట్టకేలకు నవంబర్ 25, 2025 న గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి 12,728 గ్రామాలలో నూతన సర్పంచులను ఎన్నుకునేందుకు డిసెంబర్ 11, 13, 17న మూడు విడుతలలో ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ ఎన్నికలో భాగంగా వివిధ గ్రామాలలో జరగబోతున్న పరిణామాలు, వాటి తీరు సగటు మానవున్ని ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తుందని చెప్పవచ్చు. మిగతా ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికలు ప్రత్యేకం. ఎందుకంటే గ్రామాలలో 500 నుండి 25,000 జనాభాకు 5 నుండి 21 వార్డులుగా విభజింపబడి ఉంటుంది. పంచాయతీ రిజర్వేషన్ ప్రకారం ఇప్పటికే ఆశావహులు ఓటరు జాబితా ముందర పెట్టుకొని ప్రచారం చేసుకుంటూ, తమ ఓట్లను లెక్కబెట్టుకుంటూ తమ గెలుపు కోసం ఏమేమి చేయాలో, ఎలా చేయాలో విశ్లేషణతో ఒక అంచనా వేసుకుంటుంటారు. గ్రామాలలో కొంత మంది ఒక వర్గానికి బహిరంగంగా మద్దతునిస్తూ ప్రచారంలో సైతం పాలుపంచుకుంటారు. ఇలాంటి వాళ్ళతో అభ్యర్థులకు ఎలాంటి అనుమానం లేదు.
అయినప్పటికీ అభ్యర్థులు వారికి వివిధ ప్రోత్సాహకాల ఆశజూపో, ఇంకేమైనా అవకాశాలు కల్పించో, రహస్యంగా మంతనాలు జరుపుతూ, తమవైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మరొక వర్గం బరిలోనున్న అందరితో మంచిగా నడుచుకుంటూ ఎవ్వరు వచ్చి ఓటు అడిగిన సరేనని తలఊపుతూ వుంటారు. వీరు ఎవ్వరికి ఓటు వేస్తారో తెలుసుకోలేక అభ్యర్థులు తలలు పట్టుకుంటారనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. వీరిని తమవైపు తిప్పుకోవడానికి బహుమతులను, వివిధ రకాల హామీలిస్తూ, విందు వినోదాలతో ఎక్కువ సమయం గడుపుతుంటారు. అలా గడిపి హమ్మయ్యా! వీరి ఓట్లను సాధించాను అనుకునేలోపే మరుసటి రోజు మరొక అభ్యర్థితో రహస్యంగా ఇలాంటి తంతే జరుగుతుంది. ఒకవేళ తెలిసి ఏం ఇలా జరిగిందని ప్రశ్నిస్తే? నా ఓటు నీకే కానీ! అతను పిలిస్తే వెళ్ళాను, ఏదో అలా వారు చెప్పింది విని వచ్చానని చెప్పడం, అభ్యర్థులు వీళ్ళలాంటి ఓటర్లవల్ల తలలు పట్టుకోని, ఎటూ తేల్చుకోలేక మదనపడుతుంటారనడంలో ఎలాంటి అవాస్తవం లేదు. ప్రత్యేకంగా గ్రామాలలో ఒక వింత ఆచారం కొనసాగుతుంది.
ఓట్లకోసం ప్రమాణాలు చేయించడం, వివిధ దేవుళ్లపై ఒట్లు పెట్టించడం, డబ్బులు పంచడం, మద్యం పంచడం లాంటివి చేస్తుంటారు. ఒక అభ్యర్థి గెలవడానికి పెట్టే మొత్తం ఖర్చులో సగానికిపైగా మద్యం కోసం పెడుతున్నారన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. ఇలాంటి పరిస్థితి కేవలం గ్రామాలల్లో జరుగుతుందని తేలికగా తీసివేయడానికి వీలులేదు. గ్రామాలలో సైతం ఉన్నత చదువులు చదివిన యువత ఉండికూడా ప్రజలలో మార్పును తీసుకరాకపోవడానికి గల కారణాలను విశ్లేషిస్తే, అన్నీ విషయాలలో సంపూర్ణ జ్ఞానమున్నవారే ఈ అలవాటుకు కారకులవుతున్నారన్నది ముమ్మాటికీ నిజం. స్వాతంత్య్రానికి ముందు ఎంతోమంది స్వాతంత్య్ర సమర యోధులు ఎన్నో అష్టకష్టాలు పడి, నిస్వార్థంతో, తమ ప్రాణాలను సైతం దేశానికి అంకితంచేసి స్వాతంత్య్రాన్ని తెచ్చిపెట్టి, అట్టడుగు వర్గాలు, బడుగు, బలహీన వర్గాల వారికీ లబ్ధి చేకూర్చాలని, రాజ్యాంగం రచించి, ప్రతి పౌరుడికీ రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఎన్నిక కావడానికి వీలు కల్పిస్తే, ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? పేదవారు ఇంకా బలవంతుల కింద బలహీనులుగానే వుంటున్నారంటే కారణం వారిలో చైతన్యం లేకపోవడమేనా? మద్యానికి, డబ్బులకు ఆశపడితే అభివృద్ధికి మరో ఐదేళ్ళు వేచి చూడాల్సిందే.
పాలకులను ధైర్యంగా అడగలేని పరిస్థితి ఏర్పడి, ఎలాంటి అభివృద్ధి ఫలితాన్ని పొందలేని పరిస్థితిని కొని తెచ్చుకున్నట్లు కాదా? నేను నా దేశ ప్రజలకు కత్తి చేతికి ఇవ్వలేదు. ఓటు హక్కు ఆయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో.. అమ్ముకుని బానిసలవుతారో అది వారిచేతుల్లోనే ఉంది అని ఏనాడో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెలవిచ్చారు. అలాగే గుడ్లగూబ పగల చూడలేదు, కాకి రాత్రి చూడలేదు. ఓటును అమ్ముకునే ప్రజలు ప్రగతిని, ప్రజాస్వామ్యాన్ని చూడలేరని అబ్దుల్ కలాం చెప్పారు. ఓటరు అంటే అభివృద్ధికి దిక్సూచి. అది ఎప్పుడు జరుగుతుంది? ఓటరు ఎలాంటి ప్రోత్సాహకాలను ఆశించకుండా, నిష్పక్షపాతంగా ఉంటూ, ఓటు విలువను పలువురికి తెలియజేస్తూ, ప్రోత్సహిస్తూ, అభివృద్ధికి పాటుబడే అభ్యర్థి పక్షాననిలిచి, బలపరుస్తూ విజయంలో కీలకపాత్ర వహించి, గెలుపుకు పాటుబడుతూ ఆ తర్వాత కావల్సిన అభివృద్ధిని చేయించుకోవడానికి, ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరికీ ధైర్యంగా ఉంటుంది. కావున ప్రతిఒక్కరూ ఆ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
– డా. పోలం సైదులు, 9441930361