ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని యూనిక్ ఎంటర్‌టైనర్ ’ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్, మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది. నాలుగు పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ఈ చిత్రం గురువారం థియేటర్లలోకి వస్తుంది.
ఈ సందర్భంగా వివేక్, మెర్విన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. “మేము తమిళంలో 20 సినిమాలు చేశాం. ఆంధ్ర కింగ్ తాలూకా తెలుగులో మా మొదటి సినిమా. ఇప్పటివరకు సినిమాలోని నాలుగు పాటలు రిలీజ్ అయ్యాయి. ఇంకా మూడు పాటలు సినిమాలో ఉన్నాయి. కథలో చాలా కీలకమైన పాటలు అవి. అందుకే ఇప్పుడే రిలీజ్ చేయలేదు. సినిమా రిలీజ్ తర్వాత విడుదల చేస్తాం. ఇందులో ప్రతి పాట విజువల్‌గా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి పాటకి అద్భుతమైన స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ మహేష్ ప్రతిక్షణం మా వెంట ఉన్నారు. మ్యూజిక్‌ని చాలా ఆర్గానిక్ గా చేశాము. ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ అందరికీ కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాలోని ఒక పాటకు మేము మొదట ట్యూన్ కంపోజ్ చేశాం. దానికి రామ్ అద్భుతమైన సాహిత్యాన్ని రాశారు. ఇది చాలా యూనిక్ స్టోరీ. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో కూడా మేము చాలా కొత్త సౌండ్‌ని ప్రయత్నించాము. సినిమా చూస్తున్నప్పుడు చాలా కొత్త అనుభూతి కలుగుతుంది” అని అన్నారు.